టీమిండియాకు అప‌శ‌కునం

July 04, 2020

టీమిండియా జ‌ట్టుకే కాదు.. దేశ క్రికెట్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్ గా చెప్పాలి. టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధ‌వ‌న్ తాజాగా జ‌ట్టు నుంచి వైదొలిగారు. ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో అత‌ని బొట‌న‌వేలుకు గాయం కావ‌టం తెలిసిందే. గాయంతోనూ ఆట ఆడిన అత‌డు ఆసీస్ పై ఘ‌న విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాడు.
అయితే.. అత‌ని చేతికి త‌గిలిన గాయం పెద్ద‌ది కావ‌టం.. అత‌డు ఎట్టి ప‌రిస్థితుల్లో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించ‌టంతో అత‌డి బ‌దులు జ‌ట్టులోకి రిష‌బ్ పంత్ ను ఆడిస్తార‌ని చెబుతున్నారు. ఆదివారం ఓవ‌ల్ మైదానంలో ఆస్ట్రేలియాతోజ‌రిగిన మ్యాచ్ లో ధ‌వ‌న్ ఎడ‌మ చేతి బొట‌న‌వేలుకు బంతి బ‌లంగా త‌గిలింది. దీంతో.. అత‌ని చేతికి గాయ‌మైంది.
అయిన‌ప్ప‌టికీ ఆట‌ను కొన‌సాగించిన అత‌డు.. 117 ప‌రుగులు సాధించ‌టం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత అత‌డికి వైద్య ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా.. వేలు ఎముక చిట్లిన‌ట్లుగా తేలింది. దీంతో.. రానున్న మూడు వారాల్లో జ‌రిగే మ్యాచ్ ల‌లో శిఖ‌ర్ పాల్గొనే అవ‌కాశం లేదు. ఈ స‌మ‌యంలో న్యూజిలాండ్.. పాకిస్తాన్.. అఫ్ఘ‌నిస్తాన్.. వెస్టిండీస్.. ఇంగ్లండ్ జ‌ట్ల‌పై మ్యాచ్ ల‌కు ఆడే అవ‌కాశం లేదు. షెడ్యూల్ ప్ర‌కారం ఈ మ్యాచులు ఈ నెల‌లోనే జ‌ర‌గ‌నున్నాయి.
మాంచి ఊపు మీద ఉన్న శిఖ‌ర్ త‌న జోరును సాగిస్తే.. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే అనుకుంటున్న వేళ‌.. అనుకోని రీతిలో ఎదురైన ఈ గాయం జ‌ట్టు జోరు మీద ప్ర‌భావాన్ని చూపించే ప్ర‌మాదం ఉంది. శిఖ‌ర్ లేని లోటును రిష‌బ్ ఎంత మేర భ‌ర్తీ చేస్తాడో చూడాలి. ఆసీస్ మీద విజ‌యంతో.. వ‌ర‌ల్డ్ క‌ప్ మీద ఆశ‌లు పెరిగిన వేళ‌.. గాయంతో శిఖ‌ర్ బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌టం అప‌శ‌కునంగా కొంద‌రు అభిమానులు భావించ‌టం గ‌మ‌నార్హం.