సానియా మీర్జాకు.. సింధు ఛాలెంజ్

August 11, 2020

ప్రజలు కరోనా బారిన పడకుండా అవగాహన పెంచేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. విపరీతంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతలు, సినీ యాక్టర్లు, స్పోర్ట్స్‌స్టార్లు తమవంతుగా అభిమానులకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి, పరిసరాలను ఎలా ఉంచుకోవాలో వివరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO తీసుకొచ్చిన సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలాదేశాల్లో సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌ స్వీకరించి పాటించారు. మరికొందరికి సవాల్‌ విసిరారు. ఇలా ఇది ప్రపంచమంతా విస్తరించింది. ఈ ఛాలెంజ్‌ ఏమిటంటే, చేతులను శుభ్రంగా కడుక్కోవడమే. అరచేతులు, వేళ్లమూలలు, గోర్ల సందుల్లో ఎలా శుభ్రం చేసుకోవాలన్నదానినే ఈ ఛాలెంజ్‌ వివరిస్తుంది.
తాజాగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డా విసిరిన సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌ను బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు స్వీకరించారు. తనను సవాల్‌ చేసినందుకు థాంక్స్‌ చెప్పారు. తాను చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు, టీమిండియా కెప్టెన్‌ కోహ్లి, టెన్నిస్‌ ముద్దుగుమ్మ సానియా మీర్జాకు సింధు సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌ విసిరారు. ప్రజలంతా కూడా ఇలాంటి శుభ్రత పాటించాలని సూచించారు. నెత్తి మీద ఐస్ గుమ్మరించుకోవడం, రన్నింగ్‌ కారు దిగి డాన్సులేయడం లాంటి పనికిమాలిన చాలెంజ్‌ల బదులు ఇలాంటి ఆరోగ్యకర పోటీ ఉంటే బాగుంటుందన్నది నెటిజన్ల మనోగతం.