స‌మంత కాదు.. దీపిక కావాలట ఆమెకి !

August 11, 2020

భార‌త బ్యాడ్మింట‌న్ సూప‌ర్ స్టార్ సింధు బ‌యోపిక్ గురించి రెండు మూడేళ్లుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో ఈ తెలుగు తేజం ర‌జ‌త ప‌త‌కం సాధించిన కొన్ని నెల‌ల‌కే ఆమె మీద సినిమాకు స‌న్నాహాలు మొద‌లుపెట్టాడు బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్. ఐతే స్క్రిప్టు ప‌నుల్లో ఆల‌స్యం జ‌ర‌గ‌డం.. సింధు ఆ త‌ర్వాత మ‌రిన్ని విజ‌యాలు సాధించ‌డం.. దానికి త‌గ్గ‌ట్లుగా మార్పులు చేర్పులు చేయాల్సి రావ‌డంతో ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. ఐతే ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌లో సింధు స్వ‌ర్ణం గెల‌వ‌డాన్నే క్లైమాక్స్‌గా సెట్ చేసి స్క్రిప్టు లాక్ చేస్తున్నామ‌ని.. ఇంకొన్ని నెల‌ల్లోనే సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని సంకేతాలిచ్చాడు సోనూ.
ఐతే ఇంత‌కీ సింధు పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ పాత్ర‌కు స‌మంత‌ను ఎంచుకున్న‌ట్లుగా కొన్ని రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ పొడ‌గ‌రి, యుక్త వ‌య‌స్కురాలైన సింధు పాత్ర‌కు స‌మంత సూట్ కాద‌న్న అభిప్రాయాలున్నాయి. ఈ విష‌యంలో అస‌లు సింధుకే స‌మంత ప‌ట్ల ఆస‌క్తి లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌న పాత్ర‌ను ఎవ‌రు చేస్తే బాగుంటుందో సింధు స్వ‌యంగా వెల్ల‌డించింది. దీపికా ప‌దుకొనే అయితే బాగుంటుంద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డింది. ఇది త‌న అభిప్రాయం అని.. నిర్మాత‌లు ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌న‌కు ఓకే అని.. త‌న పాత్ర ఎవ‌రు చేస్తార‌న్న‌ది త‌న‌కు తెలియ‌ద‌ని సింధు స్ప‌ష్టం చేసింది. దీపికా.. బ్యాడ్మింట‌న్ లెజెండ్ ప్ర‌కాశ్ ప‌దుకొనే కూతురు. ఆమెకు బ్యాడ్మింట‌న్‌లో ప్ర‌వేశం కూడా ఉంది. పైగా పొడ‌గ‌రి. దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న న‌టి. దీన్ని దృష్టిలో ఉంచుకునే సింధు కూడా ఈ మాట అన్న‌ట్లుంది.