హాట్ సింగ‌ర్ కు షాకింగ్ అనుభ‌వం!

June 04, 2020

అర్థం లేని నిబంధ‌న‌ల్ని ఫాలో అవుతూ ప్ర‌ముఖుల్ని.. సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేసే సంస్థ‌లు కొన్ని ఉంటాయి. ఇప్పుడా కోవ‌లోకే చేరుతుంది సింగ‌పూర్ ఎయిర్ లైన్స్. ప్ర‌ముఖ గాయ‌ని శ్రేయా ఘోష‌ల్ కు తాజాగా చేదు అనుభ‌వం ఎదురైంది. సింగ‌పూర్ జ‌ర్నీలో ఆమె ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొన్నారు.
త‌న‌తో పాటు ఒక వాయిద్య ప‌రిక‌రాన్ని శ్రేయాఘోష‌ల్ వెంట తీసుకెళ్లారు. దాన్ని విమానంలో క్యారీ చేయ‌టానికి ఒప్పుకోలేదు సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది. ఆమె ఎంత వివ‌రించినా.. నో అంటే నో చెప్పేశారు. దీంతో.. ఆమె స‌ద‌రు వాయిద్య ప‌రిక‌రాన్ని ఎయిర్ పోర్ట్ లోనే వ‌దిలేయాల్సి వ‌చ్చింది.
ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో పేర్కొన్న శ్రేయాఘోష‌ల్ సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ తీరు మీద అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ సంస్థ సంగీత క‌ళాకారుల వ‌ద్ద విలువైన వాయిద్య ప‌రిక‌రాలు ఉంటే విమానంలోకి ఎక్క‌నివ్వ‌దేమో.. అంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. మంచిది.. ధ‌న్య‌వాదాలు.. నాకు గుణ‌పాఠం నేర్పారంటూ ఆమె పెట్టిన ట్వీట్ కు ప‌లువురు ఆమెకు అండ‌గా నిలిచారు. సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ తీరును త‌ప్పుప‌ట్టారు.
ఇదిలా ఉంటే.. తాజాగా శ్రేయాఘోష‌ల్ ట్వీట్ ను చూసిన ఎయిర్ లైన్స్ సంస్థ‌.. ఆమెకు సారీ చెబుతూ ట్వీట్ చేశారు. శ్రేయా మీకు ఇలా జ‌రిగినందుకు చింతిస్తున్నాం.. అస‌లేం జ‌రిగిందో.. మా సిబ్బంది మీతో ఏమ‌న్నారో కాస్త వివ‌రంగా చెప్ప‌రా? అంటూ రియాక్ట్ అయ్యారు. వివ‌ర‌ణ అడ‌గ‌టంతో ఆపేయ‌కుండా.. ఆమెకు ఎదురైన చేదు అనుభ‌వాన్ని వీలైనంత వ‌ర‌కూ త‌గ్గించే కార్య‌క్ర‌మం చేప‌డితే మంచిది.