వేధింపులు తట్టుకోలేక సింగర్ ఆత్మహత్య

August 09, 2020

సామాన్యుల జీవితాల మాదిరే సెలబ్రిటీల బతుకులు ఉంటాయి. కాకుంటే.. వారికుండే గ్లామర్ కారణంగా.. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు చాలా వరకూ బయటకు రావు. కొందరి విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి. వర్థమాన గాయనిగా కన్నడిగులకు పరిచయమున్న సుష్మిత సూసైడ్ చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకొని తనువు చాలించిన ఆమె.. తాను ఎదుర్కొన్న చిత్రహింసలెన్నో వాట్సాప్ మెసేజ్ లో పేర్కొంది.
బెంగళూరులోని ఇంట్లో ఉరివేసుకున్న ఆమె ఆత్మహత్య శాండిల్ వుడ్ లో సంచలనంగా మారింది. పలు కన్నడ చిత్రాలు.. సీరియల్స్ తో గుర్తింపు పొందిన ఆమె.. అత్తింట్లో ఎదురవుతున్న చిత్రహింసల్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తన తమ్ముడు వాట్సాప్ కు ఆత్మహత్య చేసుకోవటానికి ముందు ఆమె ఒక మెసేజ్ పంపారు.
అందులో తన తల్లిదండ్రులు తనను క్షమించాలని కోరారు. తన భర్త.. వారి బంధువులు తనను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని.. అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తన తప్పునకు తానే శిక్ష అనుభవిస్తున్నట్లుగా పేర్కొని ఉరి వేసుకున్నారు.
తన ఆత్మహత్యకు కారణం తన భర్త శరత్ తో పాటు.. బంధువులు వైదేహి.. గీతలే కారణమన్న ఆమె.. పెళ్లి అయిన ఏడాదిన్నర నుంచే తాను వేధింపులకు గురైనట్లుగా చెప్పారు. తనను వేధించిన వారెవరినీ వదిలిపెట్టొద్దని ఆమె కోరారు. తన డెత్ నోట్ ను తల్లికి చూపించాలని.. తమ్ముడ్ని కోరారు. సుష్మిత తల్లిదండ్రులు తన కుమార్తె ఆత్మహత్యకు భర్త.. అత్తమామలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.