కేజ్రీ వాల్ కే ఎందుకిలా జరుగుతోంది?

July 08, 2020

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ‌నం చేతిలో దెబ్బ‌లు తినేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారా? అన్నభావ‌న క‌లుగుతోంది. వ్య‌వ‌స్థ‌లో మార్పు కోసం సివిల్ స‌ర్వెంట్ ఉద్యోగాన్ని కూడా వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కేజ్రీ... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తోమ పాటు ప్ర‌స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా చుక్క‌లు చూపించారు. ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ బ‌రిలో నిలిచినా... రెండు పార్టీల‌కు షాకిస్తూ వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు ఢిల్లీ సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్న కేజ్రీ.. ఆ రెండు పార్టీల‌కు భారీ షాకే ఇచ్చార‌ని చెప్పాలి. ఇంత‌గా జ‌నాల్లో మంచి నేత‌గానే ముద్ర వేయించుకున్న కేజ్రీకి చాలా అవ‌మానాలే జ‌రిగాయి.

ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చినా... జ‌నంలో నుంచి దూసుకువ‌స్తున్న ఎవ‌రో, ఒక‌రు కేజ్రీపై దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే ఇలాంటి దాడులు చాలానే జ‌రిగాయి. వీటిలో కొన్ని గురి త‌ప్పితే... మ‌రికొన్ని ఆయ‌న‌కు తాక‌నే తాకాయి. మొన్న‌టికి మొన్న ఢిల్లీ స‌చివాల‌యంలోనే త‌న కార్యాల‌యం స‌మీపంలోనే కేజ్రీపై దాడి జ‌రిగింది. ఇలాంటి త‌రుణంలో త‌న భ‌ద్ర‌త‌పై పెద్ద‌గా దృష్టి సారించ‌ని కేజ్రీ... ఎన్ని సార్లు వ‌చ్చి కొడతారో కొట్టుకోండన్న రీతిలోనే సాగిపోతున్నారు. తాజాగా కేజ్రీపై మ‌రోమారు దాడి జ‌రిగింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఢిల్లీలో త‌న పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం ప్ర‌చారం నిర్వ‌హించేందుకు కేజ్రీ వెళ్లారు. ఓపెన్ టాప్ కారులో నిల‌బ‌డి ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో న‌గ‌రంలోని మోతీ న‌గ‌ర్ లో ఓ వ్య‌క్తి ఊహంచని వేగంతో కారు బానెట్ పైకి ఎక్కి కేజ్రీ చెంప‌ను చెళ్లుమ‌నిపించారు. క్ష‌ణిక కాలంలో జ‌రిగిన ఈ దాడితో ఆప్ కార్య‌కర్త‌లు షాక్ తిన‌గా... కేజ్రీ కారు వెన‌క్కు జ‌రిగిపోయారు. అంతటితో ఆగకుండా కేజ్రీవాల్‌పై తీవ్రంగా దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనతో అవాక్కయిన కేజ్రీవాల్‌ వెనక్కి జరిగి దుండగుడి దాడి నుంచి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆప్‌ కార్యకర్తలు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. మొత్తంగా కేజ్రీపై మ‌రో దాడి జ‌రిగిపోయింది.