తొలి సినిమా షూట్ పూర్తి కాలేదు.. రెండు సినిమాల్లో ఛాన్స్

May 26, 2020
CTYPE html>
పేరుకు హీరోలే కానీ.. ఇక ఇమేజ్ వచ్చాక కానీ కిక్కు ఉండదు. సినిమాలు వెతుక్కుంటూ వచ్చినా.. ఎంపిక విషయంలో ఆచితూచి అనే మాటకు సైతం చెమటలు పట్టేలా చేసే అలవాటు తెలుగు హీరోల సొంతం. ఈ కారణంతోనే ఏడాదికి.. ఏడాదిన్నరకు ఒక సినిమా చేయటం.. దానికి ఒళ్లంతా హునమైనట్లుగా కలరింగ్ ఇవ్వటం కనిపిస్తుంది. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. శోభన్ బాబు.. బాలయ్య.. ఆ మాటకు వస్తే చిరంజీవితో సహా ఏడాదికి ఐదారు మొదలుకొని పది.. పదకొండు సినిమాలు చేసిన రోజులున్నాయి.
ఇప్పడవన్నీ మారిపోయాయి. సినిమాల ఎంపిక విషయంలో హీరోల నాన్చివేత ధోరణి ఎంతలా పెరిగిందంటే.. హీరోల ఫ్యాన్స్ వేరే హీరో అభిమానులుగా షిఫ్ట్ అయ్యే పరిస్థితి. పేరున్న హీరోల పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని సినిమాలు చేసినా అంతంత పేరు మాత్రమే సంపాదించుకున్న వారికి.. సినిమా అవకాశాలు పెద్దగా రాని పరిస్థితి. హీరోయిన్ గ్లామర్.. గ్రామర్ బాగా ఉంటే.. వరుస పెట్టి అవకాశాలు వస్తాయి. కానీ.. యువ హీరోలకు అలాంటి అవకాశం ఉండదు.
ఎందుకంటే హీరో పేరు మీదనే సినిమా బిజినెస్ మొత్తం సాగుతుంది. ఇమేజ్ విషయంలో కాస్త తేడా వచ్చినా.. మొత్తం ప్రాజెక్టు ఎఫెక్ట్ అవుతుంది. అందుకే బాగా పేరున్న హీరోల గ్రీన్ సిగ్నల్ కోసం నిర్మాతలు కిందా మీదా పడుతుంటే.. ఒక మోస్తరు హీరోలు రివర్స్ లో నిర్మాత గ్రీన్ సిగ్నల్ కోసం నిరీక్షిస్తుంటారు. ఇలా పోటీ ఎక్కువగా ఉండే టాలీవుడ్ లోకి మరో కొత్త హీరో వస్తున్నాడు. కాకుంటే.. మిగిలిన వారికి కాస్త డిఫరెంట్ అన్న విషయాన్ని తన తొలి సినిమాతోనే చెప్పేయనున్నాడు. ఇంతకీ అతగాడు ఎవరంటారా?  
పెళ్లిచూపులు.. మెంటల్ మదిలో చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి. కథే హీరో తప్పించి.. మరేమీ కాదని బలంగా నమ్మే ఈ నిర్మాత కుమారుడు శివ కందుకూరి. తన మూడో సినిమాను నిర్మించేందుకు కాస్త గ్యాప్ తీసుకొని.. చూసీ చూడంగానే చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమాకు తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నారు. నిర్మాత కొడుకు కదా? అని అవకాశం రాలేదని.. దర్శకుడు పదకొండుసార్లు ఆడిషన్లు చేసి.. ఓకే చేసిన తర్వాతే హీరోగా అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
సొంత బ్యానర్ లోనే పదకొండుసార్లు ఆడిషన్ ఇచ్చిన శివ.. తన తొలి సినిమా విడుదల కాక ముందే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పేయటం ఆసక్తికరంగా మారింది. తొలి పరీక్ష ఎలా రాశాడన్న విషయంపై క్లారిటీ రాక ముందే రెండు సినిమాలకు అవకాశం రావటం ఒక ఎత్తు అయితే.. అందులో మరొకటి కూడా ఇప్పటికే పూర్తిచేయటం విశేషం. మరీ.. శివ కందుకూరి అయినా టాలీవుడ్ హీరోలకు భిన్నమైన ట్రాక్ లో నడుస్తారేమో చూడాలి.