కూడుపెట్టేది నైపుణ్యమే...ఇంగ్లీషు కాదు...

August 03, 2020

ఉద్యోగం రావాలంటే ఇంగ్లీషు తప్పనిసరిగా రావాలి. ఇంగ్లీషే ఈ ప్రపంచాన్ని ఏలబోతోంది. మిగతా భాషలు చచ్చిపోయినా బాధ పడక్కర్లేదు. అంతేనా! ప్రతి ఒక్కరూ ఇంగ్లీషు నేర్చుకొంటేనే మన సమస్యలన్నీ పరిష్కారమౌతాయన్నంతగా ఇటీవల ప్రచారం జరుగుతోంది. నేను అల్లోపతి డాక్టర్ని. నా దగ్గరకు వచ్చే రోగుల్లో వ్యవసాయదారులు, గృహిణులు, వ్యాపారస్తులు, కుల వృత్తులు చేసుకునేవారు, రోజు కూలీలు ఉంటారు. గత 35 సంవత్సరాలలో వారెవ్వరూ నన్ను వైద్యంలో సలహా సంప్రదింపుల కోసం తప్ప, వ్యవసాయంలో సందేహాలు గానీ, ఏ కూర ఎలా చేయాలని గానీ, వారి వ్యాపారాలలో గానీ, కుల వృత్తులలో గానీ ఎదురైన ఇబ్బందులకు సమాధానాలు కావాలని ఎవ్వరూ అడగలేదు. ఎందుకంటే నాకు వాటిల్లో నైపుణ్యం లేదని వారికి తెలుసు.

నాకున్న నైపుణ్యం 'వైద్యమే' కాబట్టి వైద్య సలహాలు కాక మిగతా సలహాలు కోరలేదు. నాకున్న ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని కూడా ఎవ్వరూ తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. నన్ను వైద్యుడిగా నిలబెట్టింది వైద్యంలో నాకున్న నైపుణ్యం తప్ప నా ఇంగ్లీషు కాదు. వృత్తిపరమైన జ్ఞాన సముపార్జనకు, సమావేశాలకు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ఇతర దేశాల పర్యటనలప్పుడు నాకున్న ఇంగ్లీషు పరిజ్ఞానం ఉపయోగపడింది. ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకున్న మా తరానికి ఇంగ్లీషులో వైద్యవిద్య అభ్యసించడానికి పెద్దగా ఇబ్బంది పడింది లేదు. 3-4 నెలల్లో ఆ భాషకు అలవాటై పోయాం. వైద్య కళాశాలలో మా తరంలో ఎల్‌.కె.జి. నుండీ ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవారు కూడా కొందరు ఉండేవారు. తర్వాత జీవితంలో బాగా రాణించడంలో 'వైద్యంలో నిపుణత', 'వృత్తిలో అంకిత భావం', 'సమాజం పట్ల ప్రేమ' ముఖ్య పాత్ర వహించాయి కానీ వారికున్న ఆంగ్లభాషా పరిజ్ఞానం కాదు.

చల్లపల్లిలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన డా||నళినీ కుమార్‌, అమెరికాలోని 'యేల్‌' యూనివర్శిటీలో సైంటిస్ట్‌గా ఎదగడానికి కారణం అతనికి జీవశాస్త్రం పట్ల ఉన్న అనురక్తి. ఇంటర్‌ వరకు తెలుగు లోనే చదివిన ఆయన స్వీడన్‌లో పరిశోధన చేయాల్సి వచ్చినప్పుడు అతి తక్కువ కాలంలోనే ఆంగ్లభాషలో ప్రావీణ్యం సంపాదించారు. ఏ కొత్త భాషనైనా నేర్చుకోవడానికి 3 నుండి 6 నెలలు చాలు అని భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు గదా! చల్లపల్లి మండలం, బొబ్బర్లంక దళిత వాడకు చెందిన మాతంగి కోటేశ్వర రావు 10 భాషలలో అనర్గళంగా సంభాషించగలడు. అతడు స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో 9 వరకే చదువుకున్నాడు. అతను మంచి ఎలక్ట్రీషియన్‌. అతణ్ణి ఉద్యోగంలో పెట్టుకున్న కాంట్రాక్టరు ఏ ప్రదేశానికి వెళ్ళమన్నా ఆ ప్రదేశానికి వెళ్ళేవాడు. ఇంగ్లీషు కంటే ముందు అతనికి తెలుగు కాక తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, నైజీరియా లోని రెండు భాషలు వచ్చు. మేం అతన్ని ఇంటర్వ్యూ చేసే సమయానికి టాంజానియా వెళ్ళడానికి సిద్ధమౌతున్నాడు. 'మీరు అక్కడి భాష నేర్చుకొనే వెళ్తున్నారా?' అని అడిగితే, నవ్వి 'అక్కడ ఏ భాషో నాకు తెలియదు, ఎక్కడకు వెళ్ళినా 3 నెలల్లో ఆ ప్రాంతపు భాష నేర్చుకోగలను' అని ధైర్యంగా చెప్పాడు. అతడు తన జీవితాన్ని గెలుచుకోవడానికి అతనికి ఉన్న ఎలక్ట్రికల్‌ నైపుణ్యం ఉపయోగపడిందే కాని ఇంగ్లీషు కాదు. తమిళనాడు లోని పర్యాటక ప్రదేశాలలో కిరాయి కార్ల డ్రైవర్లు హిందీలో చక్కగా మాట్లాడటం గమనించాను. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగి, స్కూళ్ల నుండి హిందీని తరిమేసి చాలా కాలం అయ్యింది. అయినా వారికి ఆ భాష ఎలా వచ్చింది అని అడిగితే 'ఉత్తర భారతదేశ యాత్రికులతో సంభాషించాలి కదా. అందుకని మాకు వచ్చేస్తుంది' అని సమాధానమిచ్చారు. 'అవసరం' వారికి కొత్త భాషను నేర్పింది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకి ఖ్యాతి తెచ్చింది ఆయన నటనా నైపుణ్యమే గానీ ఇంగ్లీషు కాదు. ఇంగ్లీషు నేర్చుకొన్నాక మరింత ఎక్కువమందితో భావ వ్యక్తీకరణ చేయగలగడం ఆయనకు అదనపు సౌకర్యం మాత్రమే. తన అద్భుతమైన మిమిక్రీతో, నటనా సామర్ధ్యంతో మన తెలుగు రత్నం 'జానీ లీవర్‌' హిందీ సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడే కానీ అతని ఇంగ్లీషు భాషా పాండిత్యంతో కాదు. 'రామన్‌ మెగసెసే' అవార్డు గ్రహీత మహారాష్ట్రకు చెందిన డా||రజనీకాంత్‌, అరోలి వద్ద కృత్రిమ అవయవాల తయారీ విభాగం అధిపతి, తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన దళితుడు. అతడు 4వ తరగతితోనే చదువు ఆపేశాడు. తన సొంత భాష కాక మరాఠీ, హిందీ, ఇంగ్లీషు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆఫ్రికా ఖండం లోని వివిధ దేశాలకు వెళ్ళి కృత్రిమ అవయవాల తయారీకి శిక్షణ ఇచ్చి వస్తుంటాడు. 'ఇంగ్లీషు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు? ఎంతకాలం శిక్షణ పొందావు?' అని అడిగాను. ఎక్కడా శిక్షణ పొందలేదని, వారి సంస్థకు విదేశీయులు కొందరు వస్తున్నారని, వారితో వ్యవహరించవలసి రావడంతో ఇంగ్లీషు వచ్చేసిందని చెప్పాడు. ఇతనికి ఆంగ్ల భాష వంటబట్టడానికి కారణం 'అవసరమే'. అలాగే ఐ.ఐ.టి. కాన్పూర్‌లో అద్భుతంగా రాణించిన గడ్డం జాషువా సునీల్‌ హైస్కూల్‌ చదువంతా తెలుగు మీడియం లోనే సాగింది. ఇటువంటి ఉదాహరణలు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు.

సమాజంలో ఎక్కువ ఉద్యోగాలు, సైన్సు, సోషల్‌, లెక్కలు పునాదిగా ఉంటాయి. భాషా పండితుల అవసరం కొద్దిమేరకే. అందుకే వారికి తక్కువ శాతం ఉద్యోగాలు ఉంటాయి. పై మూడు శాస్త్రాలు బాగా అర్థం కావాలంటే పాఠశాల విద్య, పిల్లల సొంత భాషలో ఉంటేనే సాధ్యం. సొంత భాషలో పునాదులు ఏర్పడిన తర్వాత ఎన్ని భాషలైనా తేలికగా నేర్చుకోవచ్చునని భాషా శాస్త్రవేత్తలు ఎప్పుడూ చెప్తున్న విషయమే. ఇంగ్లీషుని 3వ తరగతిలో ప్రవేశపెట్టి 'రెండవ భాషా బోధనా పద్ధతుల' ప్రకారం బోధిస్తే 10వ తరగతి పూర్తి అయ్యేటప్పటికి ఇంగ్లీషు మాట్లాడటం ఒక సమస్యే కాదు. అలా కాకుండా 1వ తరగతి నుండీ ఇంగ్లీషులో పై మూడు శాస్త్రాలు బోధిస్తే (అర్థం కాని భాషలో అర్థం కాని విషయం) ముందు ముందు నేర్చుకోవాల్సిన నైపుణ్యాలకు పునాదులు లేకుండా పోతాయి. చుక్కా రామయ్య మాస్టారు చెప్పినట్లు ప్రాథమిక విద్యా బోధన ఇంటి భాషలోనూ, హైస్కూల్‌ విద్యా బోధన తెలుగు లోనూ ఉండాలి. ఆంగ్లం నేర్చుకోవడానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పడం లేదు. కానీ భాషను భాషగానే నేర్పాలి. సైన్సు ద్వారా, లెక్కల ద్వారా, సోషల్‌ ద్వారా ఇంగ్లీషు నేర్పడం అశాస్త్రీయం. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి ప్రయోగం జరగలేదు. ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య ఒక వ్యాసంలో రాసిన ఈ మాటలు నాకు పదే పదే గుర్తుకు వస్తుంటాయి. 'దళిత బహుజనుల్లో నుండి, కటిక పేదరికం నుండి వచ్చిన నాలాంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదవడం వల్లనే జీవితాలను గెలుచుకొన్నారు, గెలుచుకొంటున్నారు'.

- డా|| దాసరి రామకృష్ణ ప్రసాద్‌