ఇక నుంచి మంచోళ్లకి కార్ ఇన్సూరెన్స్ తక్కువ రేటట!

July 04, 2020

వాహనాల ఇన్స్యూరెన్స్ అంటే ఆ వాహనం ఏ రకానికి చెందుతుంది.. ఇంజిన్ కెపాసిటీ ఎంత, దాని విలువ ఎంతనేదాన్ని బట్టి ఉండేది ఇంతవరకు. కానీ, ఇకపై ఈ పద్ధతి మారొచ్చు. ఆ వాహనానికి ఎన్నిసార్లు యాక్సిడెంటయిందనేది చూసి దాని ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించే విధానం త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, యాక్సిడెంట్ల ఆధారంగా ఆయా వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించే అవకాశాలు, అందుకు విధానాల రూపకల్పన కోసం ఐఆర్డీయే తొమ్మిది మందితో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ రెండు నెలల్లో రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. హోం శాఖ సెక్రటరీ నేతృత్వంలోని ఒక హైపర్ కమిటీ సూచన నేపథ్యంలో ఈ కమిటీని వేశారు.
నిజానికి చాలా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసేవారిని నియంత్రించేందుకు వారి వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ దీనికి సంబంధించి ముందడుగు పడలేదు. పాశ్చాత్య దేశాల్లో కొన్నింట్లో ఇలాంటి విధానాలు ఇప్పటికే ఉన్నాయి. వాటి ఫలితంగా అక్కడ మంచి ఫలితాలు కూడా వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో 70 శాతం డ్రైవర్ల తప్పిదాల కారణంగానే జరుగుతున్నాయని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. ఇన్ని ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను కంట్రోల్ చేయాలంటే వారిపై అదనపు ఆర్థిక భారం భయం ఉండాలని అప్పుడే తగ్గుతారన్నది ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. దాని ప్రకారమే పలు వెస్టర్న్ కంట్రీస్ ఇలాంటి విధానాన్ని అమలు చేసి ఫలితాలు సాధించాయి. ఇప్పుడు భారత్‌లోనూ ఈ విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
అయితే.. దీనిపై విమర్శలూ వస్తున్నాయి. ప్రమాదాల నివారణకు ఇది మంచి ఉపాయంగానే కనిపిస్తున్నా దీన్ని బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే తీసుకొస్తున్నారన్న విమర్శలున్నాయి.