విడుదల రజనికి సోషల్ మీడియా దెబ్బ

February 26, 2020

ఒకప్పుడు సామాన్యుడి గొంతు ప్రపంచానికి తెలియాలంటే .. అది అసాధ్యం. మీడియాను సంప్రదించినా సవాలక్ష ఫిర్యాదుల్లో అదొకటిగా మిగిలి మరుగనపడేది. ఇపుడు ఎవరి దయ, ఎవరి ప్రాపకం అవసరం లేదు. మనకో స్మార్ట్ ఫోన్ ఉండి, మన సమస్యలో నిజాయితీ ఉంటే... ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కూడా గడగడలాడించే పరిస్థితి ఈనాడు ఉంది. సోషల్ మీడియా పవర్ అది. అంటే ప్రతి ఒక్కరి చేతికి మీడియా చేరిపోయింది. ఎవరి ఆటలు సాగే పరిస్థితి లేదు. 

తాజాగా ఏపీలో ఓ యువకుడి ఉదంతం పరిశీలిస్తే.. ఎంత పవర్ ఉన్నా... సోషల్ మీడియా అండ ఉన్నంత కాలం సామన్యుడిని ఏమీ చేయలేరు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గంలోని వంకాయలపాడు గ్రామానికి చెందిన శామ్యూల్ అధికారులు చుట్టు అనేక రోజులు తిరిగి కారుకు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు అధికారులు కరుణించి అతనికి కారు మంజూరు చేశారు. ఎస్సీ కార్పరేషన్ కింద అతనికి ఈ సాయం అందింది. అయితే... మేలో కొత్త ప్రభుత్వం రావడంతో జులైలో అతని చేతికి రావాల్సిన కారు చివరి క్షణంలో ఆగిపోయింది. కారణమేంటా అని అతను ఆరాతీస్తే... స్వయానా వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని అతనికి కారు ఇవ్వద్దని అధికారులను ఆదేశించారట. దీంతో అతను తనకు జరిగిన అన్యాయాన్ని ముందుగా అధికారుల వద్ద చెప్పుకున్నాడు. అలా అందరినీ అడుగుతూ వెళ్లాడు. ఎవరూ వినలేదు. అంతే... సోషల్ మీడియాను నమ్ముకున్నాడు.

ఆ వ్యక్తి ఓ సెల్ఫీ వీడియోను తీసి సోషల్ మీడియాలో వదిలాడు. అందులో ఏముందంటే.. ‘‘తాను కాళ్లకు చెప్పులు అరిగిపోయేలా అధికారుల చుట్టూ తిరిగి ఎస్సీ కార్పొరేషన్‌లో స్వయం ఉపాధి కింద కారు మంజూరు చేయించుకున్నానని, అయితే, జూలై 8న అందరికీ కార్లు ఇచ్చే సమయంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి తనకు మాత్రం ఆపాలని చెప్పడంతో అధికారులు నాకు కారు ఇవ్వలేదు. ఆరు నెలలుగా ఉపాధి లేకపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలను వారి పుట్టింట్లో వదిలిపెట్టాను. డిసెంబర్ 15 లోపు తనకు తన కారు మంజూరు చేయించకపోతే గుంటూరు కలెక్టరేట్ ఎదుట తన కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం’’ అంటూ విడదల రజినీని హెచ్చరిస్తూ బాధితుడు ఆ సెల్ఫీ వీడియోను తీసి పోస్ట్ చేశాడు. ఇది ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. దీంతో రేపో మాపో అతనికి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.