సోష‌ల్ మీడియాలో మోడీ ఇప్పుడు కామెడీ పీస్!

July 04, 2020

అందుకే అంటారు.. రాసుకొచ్చిన మాట‌లు.. బాగా ప్రాక్టీస్ చేసిన అంశాల మీద మాట్లాడ‌టం కాదు. ఏదైనా కొత్త విష‌యం మీద మాట్లాడే వేళ‌లోనూ.. అనుకోని ఉప‌ద్ర‌వం వ‌చ్చిన‌ప్పుడు కానీ అస‌లు సామ‌ర్థ్యం ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. తాజాగా ప్ర‌ధాని మోడీ ప‌రిస్థితి ఇలానే ఉంది. 
ఐదేళ్ల పాల‌నలో కానీ.. అంత‌కు ముందు కానీ ఎప్పుడూ లేనంత ఎట‌కారపు పీస్ గా మారారిప్పుడు. మోడీ ప్ర‌త్య‌ర్థి రాహుల్ ను ప‌ప్పు.. అమూల్ బేబీ అంటూ ఎట‌కారంచేసుకున్నోళ్లంతా ఇప్పుడు మోడీని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట‌ల‌కు మౌనంగా ఉండ‌టం మిన‌హా మ‌రింకేమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉండిపోయారు.
త‌న‌కు తానుగా తెచ్చి పెట్టుకున్న త‌ల‌నొప్పిని చూసినోళ్లంతా విస్మ‌యానికి గుర‌వుతున్న ప‌రిస్థితి. మోడీ అంటే ఏదో అనుకున్నాం.. మ‌రీ ఇంత ఎట‌కార‌మా? అయ్య‌గారిలో విష‌యం మ‌రీ ఇంత త‌క్కువ‌గా ఉంటుందా? అని ఫీల‌య్యే ప‌రిస్థితి. ఎన్నిక‌ల వేళ‌.. రాజ‌కీయ ల‌బ్థి కోసం అవ‌స‌రానికి మించిన అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించి అడ్డంగా బుక్ అయిన ఆయ‌న‌పైన సోష‌ల్ మీడియాలో ఇప్పుడు చెడుగుడు ఆడుకుంటున్నారు.
మోడీ వీర భ‌క్తులు సైతం అయ్య‌గారి అతి మాట‌ల‌పైనా సెటైర్లు పేలుస్తున్నారు. వినేవాడు బీజేపీ భ‌క్తుడైతే.. చెప్పేవాడు న‌రేంద్ర‌మోడీ అట లాంటి మొర‌టు మాట‌లెన్నో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌బ్బులున్న‌ప్పుడే మెరుపుదాడులు చేయాల‌ని తాను చెప్పాన‌ని.. ఆ ర‌హ‌స్యాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికి చెప్ప‌లేద‌ని.. మీకు(ఇంట‌ర్వ్యూ చేస్తున్న మీడియా ప్ర‌తినిధితో) చెప్ప‌టాన్ని మా సైన్యాధికారులు ఏమంటారో అంటూ పండించిన మోడీ మెలో డ్రామా ఇప్పుడు కామెడీగా మారింది.
స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ తో వ‌చ్చిన ఇమేజ్ ను ఓట్ల రూపంలో మ‌ళ్లించుకునేందుకు తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్న మోడీ తీరుపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసినా.. సామాన్య ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ది లేదు. ఎప్పుడైతే మ‌బ్బులున్న‌ప్పుడు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేయాల‌ని తాను చెప్పాన‌ని చెప్ప‌టంతో.. చాలామంది క‌ళ్లు తెరిచేలా మోడీ మాట్లాడార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
తాజాగా మోడీ క్లౌడ్ థియ‌రీ పేరుతో సెటైర్లు పేలుస్తున్నారు.
బాలాకోట్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ స‌మ‌యంలో అక్క‌డంతా మ‌బ్బులు నిండి ఉన్నాయ‌ని.. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని.. దాంతో రంగంలోకి దిగిన మోడీ.. మ‌బ్బులున్న‌ప్పుడే వారిపై దాడి చేయండి.. అప్పుడే పాక్ రాడార్లు మేఘాల‌ను దాటుకొని మ‌న విమానాల్ని గుర్తించ‌మ‌న్న స‌ల‌హా ఇచ్చిన‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకున్నారు. ఈ మాట‌ల‌తోనే అధికారులు మెరుపుదాడులు చేసిన‌ట్లుగా చెప్పుకొచ్చారు.
మ‌బ్బుల‌కు.. రాడార్ సిగ్న‌ల్స్ కు లింకేమీ లేకున్నా? గొప్ప‌లు చెప్పుకునే క్ర‌మంలో మోడీ అడ్డంగా బుక్ అయిన తీరుతో.. ప్ర‌ధాని వ్యాఖ్య‌ల్ని గొప్ప‌గా ట్వీట్ల రూపంలోనూ.. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియోల్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న తొల‌గించేస్తున్నారు. ఏదైనా మితం చాలా అవ‌స‌రం. అతితో ఎప్పుడైనా అన‌ర్థ‌మే. ఆ విష‌యం మోడీకి ఇప్పుడు బాగానే అర్థ‌మై ఉండాలి.