చంద్రబాబును అడ్డుకోలేదు, జగన్ ని కూడా అడ్డుకోం !

August 03, 2020

ఏపీ బీజేపీ అధ్యక్షుల వారి అవగాహన రాహిత్యం ఏపీ ప్రజలను విస్మయ పరిచింది. 4 దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చాలా తేలిక మాటలు మాట్లాడి జనాన్ని విస్మయానికి గురిచేశారు. ‘‘రాజధానులు రాష్ట్ర ఇష్టాఇష్టాలు దేశంలో అనేక చోట్ల రాజధానులు పెడుతుంటారు. వాటిలో కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు సోము వీర్రాజు. ఇదెపుడు జరిగిందో సోము వీర్రాజే చెప్పాలి.

రాష్ట్రాలను ఏర్పాటుచేసేది కేంద్రమే. ఏ రాష్ట్రం ఏర్పాటుచేసినా... రాజధానిని కూడా కచ్చితంగా ప్రస్తావిస్తుంది. అయితే, ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా హైదరాబాదునే రాజధానిగా చేసింది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రమే కమిటీ నియమించింది. ఈ విషయం కూడా అర్థం చేసుకోకుండా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు నలుగురిలో నవ్వులపాలయ్యాయి.

అంతేకాదు, పార్లమెంటు ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీకి ఒకటే రాజధాని ప్రస్తావించారు. పైగా కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సూచించిన ప్రాంతాల్లోనే చంద్రబాబు రాజధానిని నెలకొల్పారు. అంతకుమునుపు అన్ని రాష్ట్రాల రాజధానుల ఏర్పాటు కేంద్రం జోక్యంతోనే జరిగింది. మూడు కొత్త రాష్ట్రాలు ఇచ్చినపుడు మూడు రాష్ట్రాలకు రాజధానులు కూడా కేంద్రమే ప్రకటించింది. ఆయా రాష్ట్రాలు ప్రకటించలేదు 

ఇక ఏపీ రాజధాని విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఎలాంటి జోక్యం చేసుకోబోదని, అసలీ వ్యవహారంతో కేంద్రానికి సంబంధమే లేదని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. ఓ విచిత్రమైన ఉదాహరణ కూడా ఇచ్చారు. ‘‘ఏపీలో గ‌తంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజధాని పేరుతో సింగపూర్, జపాన్, చైనా అని పలు రకాల కథలు చెప్పారు... నాడు కూడా కేంద్రం.. బాబు మాటలపై, నిర్ణయాలపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఇప్పుడు జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల‌ విషయంలోనూ కేంద్రం అదే వైఖరిని అనుసరిస్తుంది'' అంటున్నారు. బాబు ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు... వాటికి సోము చెబుతున్నదానికి సంబంధమే లేదు. ఏమిటో మరి ఈ గందరగోళం కొత్త అధ్యక్షుడిలో !

‘‘ఏపీ రాజధాని విషయంలో బీజేపీని ఇరుకున పెట్టడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు‘‘ అని వీర్రాజు విరచించారు. అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరగాలి, అందుకోసం బీజేపీ పోరాడుతుంది‘‘ అని చెప్పారాయన.

అసలు బీజేపీ చేసిన పోరాటమేంటి? పోనీ చేయబోతున్న పోరాటమేంటో చెప్పగలరా? ఏదైనా చేస్తే కదా చెప్పడానికి. అపుడు గాని ఇపుడు గాని బీజేపీ అమరావతి రైతులతో సమావేశం ఏర్పాటుచేసిందా? వారి అభిప్రాయం తీసుకుందా? వారు అడుగుతున్నది రాజధాని అక్కడుండాలని మాత్రమే, వారు అదే న్యాయం అంటున్నారు... మరి వారు కోరుకున్న న్యాయం జరుగుతుందా? 

దీనిపై కొత్త అధ్యక్షుడికి ఏమైనా క్లారిటీ ఉందా... జీరో. మరి ఎందుకీ ఉబుసుపోని కబుర్లు. చేతనయితే అవుతుందని చెప్పాలి. లేదంటే మీ కర్మ అని వదిలేయాలి. ఈ గేమేంటి? ఏపీ రాజకీయాలు ఇకపై చాలా సీరియస్ గా ఉండబోతున్నాయట. ఏంటో అంత సీరియస్? చంద్రబాబు రాజకీయ చదరంగంలో తాను కొత్త ఎత్తుగడతో వస్తానంటున్నారు సోము వీర్రాజు. అబ్బబ్బబ్బ... వెయిటింగ్, ఏపీ మొత్తం వెయిటింగ్.