సీఎం పిల్ల‌ల్ని పిచ్చ లైట్ గా తీసేసుకున్నారు ఓట‌ర్లు!

July 08, 2020

2019లో జ‌రిగిన ఎన్నిక‌లు కొంద‌రు అధినేత‌ల‌కు అస్స‌లు అచ్చిరాలేదు స‌రిక‌దా.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. వారికి చేదు అనుభ‌వాన్ని మిగిల్చాయి. రాష్ట్రాన్ని ఏలేసే వారు.. చివ‌ర‌కు త‌మ పిల్ల‌ల్ని గెలిపించుకోలేక‌పోయార‌న్న అప‌కీర్తిని మూట‌గ‌ట్టుకున్నారు. సొంత పిల్ల‌ల్నే గెలిపించుకోలేక‌పోయారన్న త‌ల‌పోటు వారికిప్పుడు కొత్త‌గా చుట్టుకుంది. అయితే.. ఈ ముగ్గురు ముఖ్య‌మంత్రులు ద‌క్షిణాదికి చెందిన వారు కావ‌టం గ‌మ‌నార్హం.
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అధికారాన్ని చేజార్చుకోవ‌టం ఒక ఎత్తు అయితే కొడుకు.. లోకేశ్ తొలిసారి పోటీచేసిన ఎన్నికల్లోనే ఓట‌మి జీర్ణించుకోలేని ప‌రిస్థితి. తెలంగాణ‌లో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తూ.. తాను చెప్పిందే వేద‌మ‌న్న‌ట్లుగా ఉంటే తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కూతురు ఓటమి ఊహించ‌ని షాక్. ఆయ‌న కుమార్తె క‌విత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవ‌టం ఇప్పుడు ఆయ‌న‌కు విప‌రీత‌మైన వేద‌న‌ను మిగిల్చింది.
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న కొడుకును మాండ్య ఎంపీ బ‌రిలో నిలిపారు. కొడుకును ఎంపీగా గెలిపించుకునేందుకు ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. త‌న అంగ‌బ‌లాన్ని.. అర్థ బ‌లాన్ని పూర్తిగా వినియోగించుకున్న‌ప్ప‌టికీ త‌న కొడుకును మాత్రం గెలిపించుకోలేకోయారు. రాష్ట్రాల్లో అధికారం ఉన్న ముగ్గురు ముఖ్య‌మంత్రులు త‌మ పిల్ల‌ల్ని గెలిపించుకోలేక‌పోయార‌న్న అప‌కీర్తిని మూట‌గ‌ట్టుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.