ఇలాంటి కష్టం ఏ తండ్రికీ రాకూడదు

August 14, 2020

దురదృష్టవశాత్తూ కరోనా సోకి తండ్రి చనిపోయాడు. అధికారులు మృతదేహాన్ని శ్మశానానికి తరలించారు. అప్పటికే అధికారులు ఇచ్చిన సమాచారంతో కొడుకు, కోడలు, తోడల్లుడు అక్కడికి చేరుకున్నాడు. తీరా అక్కడికి వచ్చాక అధికారులకు షాక్ ఇచ్చాడు కొడుకు. మృతదేహాన్ని కట్టెలపై పేర్చడం వరకు అధికార సిబ్బందే నిర్వహించారు. తలకొరివి పెట్టడానికి అంత్యక్రియలు చేయడానికి కొడుకు నిరాకరించారు. అతని ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుని పెంచి పోషించి పెద్ద చేస్తే కరోనా భయంతో తలగొరివి పెట్టడానికి కొడుకు నిరాకరించడం ఆ తండ్రి జన్మలో చేసుకున్న పాపమో. అత్యంత శోచనీయమైన ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాో జరిగింది.

అధికారులు ఎంత నచ్చచెప్పినా కొడుకు ప్రేమ్ సింగ్ తండ్రికి తలకొరివి పెట్టలేదు. అక్కడే ఉన్న కోడలు (ప్రేమ్ సింగ్ భార్య) కూడా భర్త తలకొరివి పెడితే ఆయనకు తమకూ వస్తుందని తీవ్రంగా వ్యతిరేకించింది. వీరి ప్రవర్తనకు అధికారులు విస్తుపోయారు. ఎంత నచ్చచెప్పినా వారు వినలేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా... మృతదేహానికి ఆమడ దూరంలో నిలబడ్డారు వారు. మనస్ఫూర్తిగా కడసారి చూపునకు నోచుకోలేదు. చివరకు అధికారులే అంత్యక్రియలు చేశారు. 

పెంపకం అంటే కొడుకులకు ఆస్తులను ఇవ్వడం కాదు, సంస్కారం నేర్పడం. సంతోషంగా బతికేలా నేర్పడం. అది నేర్పనపుడు కొడుకును ఎంత పెద్దవాడిని చేసినా ఫలితం లేదు. చివరికి ఇలాంటి దు:ఖం అనుభవించాల్సి వస్తుంది. ఆత్మ అనేదే ఉంటో అది కచ్చితంగా కొడుకును క్షమించే అవకాశమే లేదు. 

ఇక ఇలాంటి వారికి నమస్తే ఆంధ్ర చెప్పే ముఖ్య విషయం...

కరోనా వైరస్ కి జీవం ఉండదు. అది ఒక నిర్జీవి. అది బతికి ఉన్న మనిషిలో మాత్రం పెరుగుతూ పోతుంది. చనిపోయిన మనిషిలో 3 -4 గంటలే ఉంటుంది. ఆ సమయం ఆస్పత్రిలోనే అయిపోతుంది. అయినా... మృతదేహానికి చేసే ట్రీట్ మెంట్ లో కూడా హైపో క్లోరైడ్ ద్రావణంతో పాటు మరిన్ని కెమికల్స్ వాడతారు. వాటి వల్ల ఆ దేహంపైన కూడా వైరస్ నశించిపోతుంది. కాబట్టి నిర్భయంగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయొచ్చు. దయచేసి మీకీ పరిస్థితి వస్తే మీరిలాంటి తప్పు చేయొద్దు. కరోనా అత్యంత భయంకరమైన వ్యాధి ఏం కాదు. అనారోగ్యం ఉన్నవారికి, ముసలివారికి ప్రమాదం. ప్రతి ఒక్కరు భయపడి కనిపెంచిన తల్లిదండ్రులకు ఆత్మశాంతి, మన:శ్శాంతి లేకుండా చేయొద్దు. మానవత్వాన్ని చంపేయొద్దు.