ఆవేశంతో ఆ హీరోయిన్ తొందరపడిందా?

August 07, 2020

కూల్ గా ఉండే వారిని సైతం హాట్ హాట్ గా మార్చే గుణం సోషల్ మీడియా సొంతం. ఎవరైనా సరే.. సోషల్ మీడియాలో కాస్త సీరియస్ గా ఎంగేజ్ అయిపోతే చాలు.. వారిలో చాలానే మార్పులు వచ్చేస్తాయి. ప్రతిదాన్ని చాలా సీరియస్ గా తీసుకోవటం.. ముక్కుముఖం తెలీనోళ్లతోనూ లడాయి పెట్టుకునేందుకు సైతం రెఢీ అయిపోతారు. అయితే.. తాము ప్రదర్శిస్తున్న కోపం.. అసహనం అవసరమా? అన్న విషయాన్ని వారు అస్సలు పట్టించుకోరు. సామాన్యుల సంగతి ఇలా ఉంటే.. సెలబ్రిటీలు సైతం అప్పుడప్పుడు బ్యాలెన్స్ మిస్ అవుతారు.
సోషల్ మీడియాలో సామాన్యుడు చెలరేగిపోతే జరిగే నష్టం కంటే.. సెలబ్రిటీలు.. ప్రముఖులు.. కీలక స్థానాల్లో ఉన్న వారు చేసే వ్యాఖ్యలతో ఇబ్బందులు తప్పవు. తాజాగా అలాంటి పరిస్థితినే కొని తెచ్చుకున్నారు బాలీవుడ్ దివాగా చెప్పుకునే సోనమ్ కపూర్. తాజాగా ఆమె సంఘ్ పరివార్ పెద్ద మనిషి మోహన్ భగవత్ చేసిన ఒక వ్యాఖ్యపై అనవసరమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
ఆదివారం ఆహ్మాదాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యావంతులు.. ధనవంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకులు నమోదవుతున్నాయని విమర్శించారు. విద్య.. డబ్బు కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ తీరుతో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని.. సమాజంలో అంతరాలు పెరుగుతున్నట్లుగా చెప్పారు.
ఈ వ్యాఖ్యల్ని సోనమ్ తీవ్రంగా తప్పు పట్టారు. మోహన్ భగవత్ పేరును ప్రస్తావించని ఆమె.. ఆయన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఇవి పూర్తిగా తెలివితక్కువ.. వెనుకబాటుతనాన్ని సూచించే మాటలుగా ఆమె ఎద్దేవా చేశారు. ఇలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె.. తొందరపడ్డారా? అంటే అవుననే చెప్పాలి. మోహన్ భగవత్ వాడిన భాష కాస్త ఇబ్బందిగా.. మనసుకు నొప్పి కలిగేలా ఉండొచ్చు. కానీ.. దేశంలోని ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లినా.. విడాకులు.. దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఎవరి మధ్య వస్తున్నాయి? అన్న విషయం మీద కాస్త ఫోకస్ పెడితే.. మోహన్ భగవత్ మాటల్లో నిజమెంతన్న విషయం ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. తొందరపాటుతో స్పందించే కన్నా.. కాస్త కనుక్కొని మాట్లాడితే సోనమ్ ఆగ్రహానికి ఫలితం ఉండేది. తాను చేసిన వ్యాఖ్యలతో లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకున్నట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.