ఉద్దవ్ ప్రమాణాస్వీకార ఆహ్వానితుల్లో మోడీ ఫ్రెండ్స్ లేరా?

May 29, 2020

పలు మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు ఒక కొలిక్కి రావటమే కాదు.. కొత్త ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం కొలువు తీరనుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడమన్న పాత సామెతను సరికొత్తగా తిరగరాసిన క్రెడిట్ శివసేనకే దక్కుతుందని చెప్పక తప్పదు. ఒక ఒరలో రెండు కాదు మూడు కత్తులు కూడా ఇమడ్చవచ్చన్న కొత్త విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేశారు ఉద్దవ్.
భావసారూప్యత ఏ మాత్రం లేని శివసేన.. ఎన్సీపీ..  కాంగ్రెస్ పార్టీలతో కలిపి ఉద్దవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సాయంత్రం జరిగే ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. ఉద్దవ్ తో పాటు ఎన్సీపీ..కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఉప ముఖ్యమంత్రులు.. పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయొచ్చని చెబుతున్నారు.
ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించటంతో పాటు.. పెద్ద ఎత్తున అతిధుల జాబితాను సిద్ధం చేశారు.  పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. వీరితో పాటు 40 వేల మంది అతిధులు.. 700 మంది రైతులను కూడా ఆహ్వానం పంపారు.
తమ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోడీ రావాలని ఉద్దవ్ కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. మాజీ ప్రధాని మన్మోహన్..రాహుల్ గాంధీలకు కూడా ఆహ్వానం వెళ్లింది. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్.. ఛత్తీస్ గఢ్ సీఎం భూషేశ్ భఘేల్.. పశ్చిమబెంగాల్ సీఎం మమత.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. రాజస్థాన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు  యూపీ మాజీ సీఎం అఖిలేశ్ తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ ను కూడా ఆహ్వానించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. రతన్ టాటా.. సినీ రంగ ప్రముఖులు అమితాబ్ బచ్చన్.. అనిల్ కపూర్.. అక్షయ్ కుమార్.. సల్మాన్ ఖాన్ తదితరులకు ఆహ్వానం పంపారు. మరి.. ఆహ్వానం పంపిన వారిలో ప్రమాణస్వీకారోత్సవానికి ఎంతమంది హాజరవుతారో చూడాలి.