యడ్డీ, మోదీ, గడ్కరీ... ఈ అమ్మాయి ప్రశ్నకు ఆన్సరేదీ?

August 14, 2020

నిజమే... కన్నడ చిత్రసీమకు చెందిన ఓ నటి సంధించిన ప్రశ్నకు ఆ కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్పతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పి తీరాల్సిందే. అయినా ఆ ముగ్గురూ ఆ నటికి ఎందుకు సమాధానం చెప్పాలంటే... వారు ముగ్గురూ సమాధానం చెప్పేంతగా ఆమె లాజికల్ క్వశ్చన్ సంధించింది కాబట్టి.

సరే... ఆ నటి ఎవరు, ఆమె ఏమని ప్రశ్నించింది అన్న విషయానికి వస్తే... కొత్త రోడ్ రూల్స్ పేరిట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే... సామాన్యులపై భారీ ఫైన్లు విధించేలా కొత్త రోడ్ రూల్స్ కు కేంద్రం శ్రీకారం చుట్టిందే కదా. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రూల్స్ కారణంగా సామాన్య జనం బాగానే ఇబ్బంది పడుతున్నారు. ఏదో పొరపాటున నిబంధనలను అతిక్రమిస్తున్నా భారీ ఫైన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు జనానికి చుక్కలు చూపిస్తున్నారు.

ఇదే అంశాన్ని ప్రస్తావించిన కన్నడ నటి సోను గౌడ... మరి సరిగా లేని రోడ్ల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నారని జనంపై భారీ ఫైన్లు వేస్తున్న ప్రభుత్వాలు... సరైన రోడ్లను ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలపై ఏ మేర ఫైన్ వేయాలంటూ సోను ప్రశ్నించారు. నిజమే మరి... ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే... భారీ ఫైన్లు సమ్మతమే అయినప్పుడు... వాహనదారులు సాఫీగా వెళ్లడానికి ఏమాత్రం అనువుగా లేని రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నట్లే కదా.

ఈ ప్రశ్నను సంధించిన సోను... ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాకు పంపిన ఓ పోస్ట్ ను జత చేశారు. వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్ చేసిన సోను... అందులో తాగినందుకు రూ.10 వేలు సెల్ ఫోన్ వాడితే రూ. 5 వేలు జరిమానా అంటూ రాశారు. అయితే బైకుదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా అంటూ సోను ప్రశ్నించారు. ఈ ట్వీట్ ఇప్పుడు పెరిగిన ఫైన్లపై చర్చను మరింత విస్తృతం చేసిందన్న వాదన వినిపిస్తోంది.