బాలు... గొంతే కాదు, మనసు కూడా మంచిదే..

August 03, 2020

నిజమే.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్య తన ఇంటిని ఇచ్చేశారు. అది కూడా స్కూల్ కోసం. అయితే.. ఇప్పుడు ఆయన నివాసం ఉండే ఇల్లు కాదు. ఏపీలోని నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో తన తండ్రి నివసించిన ఇంటిని తాజాగా వేదపాఠశాల కోసం ఇచ్చేశారు.
ఈ పాఠశాలను కంచికామకోటి పీఠం నిర్వహిస్తూ ఉంటుంది. తన తండ్రి ఎస్పీ సాంబమూర్తి లేరన్న బాధ తనకు ఉండేదని.. ఆయన పెద్ద శైవభక్తులని చెప్పారు. వారి పేరు మీద వేదపాఠశాలను నిర్వహించటం ద్వారా తన తండ్రి అక్కడే ఉంటారని తాను భావిస్తానని చెప్పారు బాలు.
కంచిపీఠానికి తాను ఇంటిని ఇవ్వలేదని.. భగవత్ సేవకోసం స్వామివారే తీసుకున్నారన్నారు. ఇంటిని అప్పగించే కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీజగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి స్వయంగా హాజరయ్యారు. కారణం ఏదైనా.. తన తండ్రి గుర్తు కోసం.. నలుగురికి ఉపయోగపడేలా ఎస్పీ బాలు తీసుకున్న నిర్ణయం ఇప్పటి తరానికి ఆదర్శమని చెప్పక తప్పదు.