ఏపీ స్పీకర్ కొడుకు బిజినెస్ సూపర్ అటగా?!

August 06, 2020

ఏపీ స్పీకర్ తమ్మినేని వ్యవహారం అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట చూస్తున్న వాళ్లకు ఆశ్చర్యం కలగకమానదు. స్పీకర్ అంటే అన్ని పార్టీలను సమంగా చూసేవారు. సౌమ్యంగా మాట్లాడాలి. సాదరంగా వ్యవహరించాలి. కానీ తమ్మినేని సీతారాం బయట బూతులతో సహా అన్నీ మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఎవరైనా బూతులు మాట్లాడుతుంటే ఆపడం కూడా లేదు. దీంతో ప్రతిపక్షం తమ్మినేని వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉంది.

ఇదిలా ఉంటే...తాజాగా స్పీకర్ తమ్మినేని గురించి తెలుగుదేశం పార్టీ పలు ఆరోపణలు చేసింది. మాజీ చీఫ్ విప్  కూనరవికుమార్ మాట్లాడుతూ ... తమ్మినేని సీతారాం, ఆయన కొడుకు ఇసుక మాఫియా అని, ప్రతిరోజు వారు 200 లారీల ఇసుక వైజాగ్ కు తరలించి అమ్ముకుంటారని ఆరోపించారు. బేతాళుడికి మానవ దేహాలంటే మహా ఇష్టం. తమ్మినేని కుటుంబానికి ఇసుక అంటే కూడా అంతే ఇష్టం అంటూ విచిత్రమైన పోలిక కూడా పెట్టారు. 

నిబంధనలకు విరుద్ధంగా వీరు ఇసుకను తవ్వేసి ఆముదాల వలస ప్రాంతంలోని యరగాం, పురుషోత్తమ పురం, పెద్దసవళాపురం ప్రాంతాలను పర్యావరణపరంగా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజంగా అవినీతి అక్రమాలను ముఖ్యమంత్రికి అడ్డుకునే ఉద్దేశం ఉంటే... స్పీకర్ అరాచకాలపై తాను సంపూర్ణ ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మంచి ముఖ్యమంత్రి అయితే వెంటనే ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.