విశ్లేషణ : జగన్ అనుకున్నంత ఈజీనా ! ?

August 03, 2020

_సీనియర్ మహిళా జర్నలిస్ట్ లలిత కుమారి విశ్లేషణ..!!_

0 ‘‘పాచికలు పట్టుకోగానే ఆట​​ ఆడినట్టు కాదు. విసిరినంతనే గెలిచినట్లు కాదు. పారినంతనే రాజ్యం గెలిచినట్లు కాదు​’’ అని మహాభారతంలో చెబుతారు. ఆట ఆడుతున్నామనుకోగానే సరిపోదు. కాలం కలిసివస్తోంది కదా… ఏ ఆటాడినా గెలుస్తామన్న ధీమా పనికి రాదు. ప్రశ్నించేవాడే లేడు, ఎదురు లేదు.. అడ్డుకునే శక్తి ఎవరికీ లేదనుకొని, *తానే బలవంతుడనని రాజు అనుకొంటే సరిపోదట. ప్రజలే రాజు బలవంతుడనుకున్నప్పుడే గొప్పవాడౌతాడు. ఇదీ రాజనీతి*. దాన్ని తప్పిన వారెవరూ చరిత్రలో నిలిచినట్లు ఏ చరిత్ర చెప్పలేదు.

0 మరి అలాంటిది రాత్రికి రాత్రి రాజధాని తరలిస్తామంటే, ఒక్క రాత్రిలో కట్టేంత సులువైందే అయితే ఇంత యాతన ఎందుకు? అంతగా కలవరం ఎందుకు? ఏళ్ల నాటి కష్టమెందుకు? రైతుల త్యాగమెందుకు? ఆత్మగౌరవ నినాదమెందుకు? తలెత్తుకొని తిరిగేంత అవసరమెందుకు? ఎక్కడైతేంది వుండేందుకు? ఎక్కడైతేంది పాలించేందుకు? ఇంకా పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ వుండనే వుంది. విశాఖకన్నా దాదాపు చాలా ప్రాంతాలకు తక్కువ దూరం. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లు సాగిల పడినా, ఉమ్మడి ఆస్థుల వ్యవహారం తేలందే, సచివాలయం అప్పగింత కుదరదని తేల్చి చెప్పి, ఇంత కాలం ఆపితే.... *వచ్చీరాగానే తాతగారి సొమ్ము దాచి పెట్టినట్లు దోచి పెట్టిన నాడే రాష్ట్ర ప్రజల భవిష్యత్తేమిటో అర్థమైంది*. మేధావులు ఆనాడే హెచ్చరించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు వేరు. ఇప్పుడు ఆచరిస్తున్నది వేరని తెలిసినా, ప్రజలంతా ఎంతో ఆశతో ఎదరుచూస్తున్న రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి, తన దైన ముద్ర వేయాలన్న కసితో సాగాల్సిందిపోయి, *వేసిన పందిళ్ళు పీకేస్తా* అనే పాలకుడిని ఎవరూ ఎక్కడా చూడలేదు.

0 అంకిత భావంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో తెలుగుజాతి తలెత్తుకుని నిలబడేలా.... ప్రపంచం గర్వించే రాజధానిని కలసి కట్టుగా నిర్మిద్దామన్న లక్ష్యం వుండాలే గాని, కూర్చునేందుకు చోటు లేదని పారిపోతా అంటే కుదరదు. ప్రజా నాయకుడంటే, పాలకుడంటే కుర్చీలో కూర్చోవడానికి రాలే​​దు. తాను సేవకుడిగా వచ్చానని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని చెప్పిన జగన్‌, పట్టుదలతో రాజధానిని పూర్తి చేసే గమ్యం వైపు సాగుతాడని అందరూ అనుకున్నారు. కాని ఆయన చంద్రబాబు వేసిన పునాదులను తవ్వి, చరిత్రలో లేకుండా చేద్దామన్న కక్షతో రాజధాని తరలింపు అన్నది నైతికత అంత కన్నా కాదు. పైగా *రాజధాని తరలింపు అన్నది చట్టబద్దంగా కూడా కుదరన్నది* ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పాలకపక్షం కలలు చెదిరిపోతున్నాయి. బాధ్యతలనుంచి పారిపోతే కుదరదని తెలుస్తోంది. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మరింతగా తెలుగువారికి వున్నంత ఉన్నతమైన రాజధాని మరెక్కడా లేదని నిరూపించాల్సిందిపోయి, పూటకూళ్ళ బతుకుగా రాజ్యపాలన చేస్తానంటే, పరిపాలన అపహాస్యమౌతుంది. ప్రజల ఆత్మగౌరవం గంగలో కలుస్తుంది.

0 నవ్విన వారి ముందు నగుబాటు కాకుండా చూడాలే తప్ప, పళ్లికిలించి నవ్వుకునేలా చేయొద్దు. ఒకనాడు తెలంగాణ వారికి పాలన తెలియదు.పరిపాలన అనుభవం లేదని, అరవై ఏళ్లపాటు వారికి అన్నీ నేర్పామని గొప్పగా చెప్పుకునే తెలుగు చరిత్ర తెగులు పట్టేలా చేయడం సరైంది కాదు. పైగా ఉన్న పణంగా రాజధాని తరలించడం అంత సులువేం కాదు. చట్ట బద్దం అంత కన్నా కాదు. ఇప్పటిప్పుడు రాజధాని తరలించాలని చూస్తే నష్టపోయిన రైతులు ఊరుకునే పరిస్ధితే వుండదు. త్యాగాలు చేసి, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రైతులు కోర్టుకెక్కక మానరు. ల్యాండ్‌ పూలింగ్‌ అన్నది పరస్పర అంగీకారంతో జరిగినా, *వాటికి చట్టబద్దతలేదన్న భ్రమలో పాలకపక్షం వుండడమే ప్రజల ఖర్మ*. లాండ్‌ పూలింగ్‌ అన్నది కూడా చట్టబద్దంగానే సాగింది. ప్రజలు ఒక ఒప్పందం ప్రకారమే, తాము స్వయంగా సంతకాలు చేసి, *ఎందుకు ఇస్తున్నారన్నదానిపై స్పష్టంగా చెప్పే భూములు ఇచ్చారు*. అంతేకాని మేం ఇస్తున్నాం, మీరు తీసుకుంటున్నారన్నంత సులువగా ఎవరూ ఇవ్వలేదు, ఎవరూ రాయించుకోలేదు. అంతా చట్ట ప్రకారమే జరిగింది. అంతే కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా జరిగింది. ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజధాని తరలించాలంటే.... ఇప్పటికిప్పుడు ప్రభుత్వం రైతులకు సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి రావచ్చని ఓ అంచనా. రాజధాని నిర్మాణానికే డబ్బులు లేవని రాజధాని తరలిస్తున్న పాలకులకు రైతులకు అంత సొమ్ము చెల్లించడం అంటే అంత ఆషామాషీ వ్యవహరం కాదు.

0 ఇప్పటికిప్పుడు పనుల పూర్తికే నిధులు లేవంటుంటే, బడ్జెట్‌లో సగానికి పైగా రైతులకు పరిహారంగానే చెల్లించాల్సి వస్తే ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాల్సిందే.... ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వున్న కాలంలో ఒక ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టర్‌ను ఉన్న ఫణంగా మార్చారు. దాంతో తనకు జరిగిన నష్టాన్ని కోర్టులో తేల్చుకోవాలని పిటీషన్‌ వేశారు. దాంతో కోర్టు ఆ కాంట్రాక్టర్‌కు సుమారు. రూ.450 కోట్లు చెల్లించాల్సిందే అని తీర్పునిచ్చింది. ఇక్కడా అదే తీర్పు ఆదర్శంగా మారుతుందన్నది నిపుణుల వాదన. ఎందుకంటే రాజధాని అన్నది ఒక ప్రాజెక్టు. దానిలో రైతులంతా పెట్టుబడుదారులే, పాత్ర దారులే, సూత్రదారులే. మరి వారికి అన్యాయం జరిగే నేపధ్యంతో వారు కోర్టుకు వెళ్లే పరిస్థితి తప్పనిసరౌతుంది. నిజానికి జగన్‌ అధికార వికేంద్రీకరణే, అభివృద్ధి వికేంద్రీకరణ అనుకొని వుంటే, ప్రజలను మెప్పించేలా ప్రజలకు పాలన, ప్రభుత్వం అందుబాటులో వుండేలా, మరో రాజధాని కూడా ఏర్పాటును ప్రస్తావిస్తే బాగుండేది. కాని *ప్రస్తుత అమరావతి రాజధానిని స్మశానంతో పోల్చిన నాడే, ఆయన నిర్ణయంలో నైతికత లేదని తేలిపోయింది*. ప్రజలకు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది.

0 ప్రజా వ్యతిరేకతను తెలిసితెలిసి మూటగుట్టకునేందుకే సిద్దమౌతున్నారని, స్వయంకృతాపరాధం గతంలోఅనేక సార్లు చేసిన సెల్ఫ్‌ గోల్‌ లాంటిదే అని గమనించుకోలేకపోయారు. రాజధాని పేరు మీద ఇప్పటికే బాండ్ల ద్వారా రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. కాస్త మేథస్సుకు పనిచెప్పేవారైనా, రాజకీయాల మీద అవగాహన వున్నవారికెవరికైనా *బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో అమరావతికి చెందిన బాండ్ల లిస్టు వుందన్న సంగతి తెలుసు. కాని పాలకులకే తెలియకపోవడం విచారకరం*. 2018లోనే బాండ్స్‌ రిలీజ్‌ చేశారు. అవి సుమారు రూ.2వేల కోట్లకు పై మాటే. ఐదేళ్లు ప్రతిపక్షంలో వుండి, అధికారంలోకి వచ్చిన పార్టీకి ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ది కాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌ మెంటు అధారిటీ ( ఏపిసిఆర్‌డీఏ) ఏర్పాటుతో బాండ్లు జారీ చేశారు. రాజధాని తరలింపుపై ఇవన్నీ చూసుకోకుండానే ప్రకటనలు చేసి, అలజడి సృష్టించి, రాజధానిపై వున్న పీట ముడులను చూసుకోకుండా చేస్తున్న దూకుడుకు కళ్లాలున్నాయని తెలియకపోవడం విడ్డూరం. ముందర కాళ్లకు బంధమంటే ఇదే మరి. *పాలకులంటే ప్రజలకు నచ్చేలా వ్యవహరించాలే గాని, తనకు నచ్చేలా వుంటానని కలలు గంటే సరిపోదు*. ప్రజాస్వామ్యంలో సాగదు. చూద్దాం, ఏం జరుగుతుందో.... అని ప్రజా సంఘాలు ఎదురు చూస్తున్నాయి…!​