వుహాన్ నుంచి బయలుదేరిన విమానం కథ తెలిస్తే అవాక్కే

August 14, 2020

ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వుహాన్ నగరంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయుల్ని ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చేస్తున్నారు. చైనా అధికారులతో భారత ప్రభుత్వం ప్రత్యేక చర్చలు జరిపిన అనంతరం.. ప్రత్యేక విమానాన్ని వూహాన్ కు పంపింది.
తాజాగా 324 మందితో ఎయిరిండియా విమానం వుహాన్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ వార్త మీరు చదివే సమయానికి విమానం ఢిల్లీలో ల్యాండ్ అయి ఉంటుంది కూడా. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతానికి ఈ విమానం దేశ రాజధానికి చేరుకుంటుంది. అత్యంత ప్రమాదరకరమైన వైరస్ కు పుట్టిల్లు అయిన వుహాన్ నుంచి వందలాది మందిని తీసుకొస్తున్న నేపథ్యంలో విమానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వుహాన్ నుంచి భారతీయుల్ని తీసుకొస్తున్న రెస్క్యూ ఆపరేషన్లో విమాన సిబ్బందితో పాటు ఢిల్లీకి చెందిన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులు.. పారామెడికల్ సిబ్బంది.. ఇంజినీర్లు.. భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ విమానంలో ఐదుగురు కాక్ పిట్ సిబ్బందితో పాటు పదిహేను మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నప్పటికీ.. వారెవరూ ప్రయాణికులకు ఎలాంటి సేవల్ని ప్రయాణ సమయంలో అందించరు.
అసలు వీరు ప్రయాణికుల వద్దకు కూడా వెళ్లరని చెబుతున్నారు. అయితే.. ప్రయాణికులు విమానం ఎక్కటానికి ముందే.. వారి సీట్ల వద్ద వారికి అవసరమైన ఆహారాన్ని.. నీళ్లను అందుబాటులో ఉంచుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాదు.. సిబ్బందికి.. ప్రయాణికులకు మాస్కుల్ని ఏర్పాటు చేశారు. వైరస్ ఇతరులకు సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఢిల్లీకి చేరిన తర్వాత వారిని ప్రత్యేకంగా పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే.. వారిని వారి సొంతూళ్లకు పంపుతారు. ఢిల్లీకి ఇప్పుడొస్తున్న ఫ్లైట్  కాకుండా.. మరో విమానాన్ని కూడా చైనాలోని భారతీయుల కోసం పంపుతున్నారు.