టీడీపీ విచ్ఛిన్నమే లక్ష్యం!

June 05, 2020
తాయిలాలతో ఎర.. కాదంటే వేధింపుల కొరడా
ప్రత్యర్థుల ఆర్థిక మూలాలపై నిర్లజ్జగా దాడి
ఏకంగా వ్యాపారాలే వదులుకోవాలని బెదిరింపులు
రాజకీయాల్లో లేనివారిపైనా దౌర్జన్యాలు
టీడీపీ ఎమ్మెల్యేలే తొలి టార్గెట్‌..
చంద్రబాబుకు విపక్ష నేత హోదా లేకుండా చేయాలనే!
పదవులు, పనులు, ఇతర తాయిలాలను చూపించి విపక్ష నేతలు, ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. దీనికి ఆద్యుడు సీఎం జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డే. హయాంలోనే మొదలైంది. టీఆర్‌ఎస్‌ పార్టీనే మింగే స్థాయిలో ఆయన ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ నడిపించారు. నాటి టీడీపీ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు), బాలనాగిరెడ్డి (మంత్రాలయం)లను, నాటి టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజాను కూడా కాంగ్రెస్‌ వైపు లాగారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా ఇదే నడిపింది. 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని.. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానని అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌.. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ సాక్షిగా చేసిన ప్రకటనపై మండిపడ్డ చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలకు తలుపులు తెరిచారు. 23 మంది ఇటు దూకేశారు. అధికార పార్టీలో ఉండే వెసులుబాట్లు ఉపయోగించుకునేందుకో, ఎన్నికల ఖర్చులు రాబట్టుకునేందుకో, ఇతర కారణాల వల్లో ఇలా పార్టీలు మారడం సహజంగా మారింది. కానీ... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది వేరు. ఇది... ‘ఆపరేషన్‌ క్రూర’! ఒత్తిళ్లు, కేసులు, ఆర్థిక మూలాలపై దాడులు, కప్పం కట్టాల్సిందేనంటూ ఆదేశాలు.. కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్న ఘోరమిది! రాజకీయ ప్రత్యర్థుల నోరు మూయించడానికి, తమ వైపు తిప్పుకోవడానికి, వారి శక్తియుక్తులను నిర్వీర్యం చేయడానికి అధికారాన్ని ఆయుధంగా మలుచుకుని నిర్లజ్జగా ప్రయోగించడం పతాక స్థాయికి చేరుతోంది. పోలీస్‌ కేసులు, విచారణల పేరుతో ఒత్తిడికి గురి చేసి లొంగదీసుకోవడం, ఆర్థిక మూలాలను దెబ్బ తీసి మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడం, తాయిలాలు ప్రయోగించడం ఈ క్రీడలో కీలకాంశాలు. దీని దెబ్బకు నాలుగైదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న, బలమైన నాయకులుగా గుర్తింపు ఉన్న వారు కూడా గింగిరాలు తిరుగుతున్నారు. ప్రత్యర్థి పక్షం తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పార్టీలు మారిపోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వారు మాత్రమేకాదు... ప్రత్యర్థి పక్షానికి మిత్రులుగా ముద్రపడిన వారు కూడా దడదడలాడిపోతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. సంధి మార్గాలు వెతుక్కుంటున్నారు.
టార్గెట్‌ దివాకర్‌రెడ్డి...
మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వైఎస్‌కు సన్నిహితుడు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు. 2014 ఎన్నికలకు ముందే జగన్‌ ఆయన్ను వైసీపీలోకి తీసుకురావాలని చూశారు. కానీ ఆయన టీడీపీలో చేరిపోయారు. 2019లో కూడా జేసీ వైసీపీ వైపు చూడలేదు. నిరుడు జరిగిన ఎన్నికల్లో తొలిసారి జేసీ కుటుంబానికి పరాజయం ఎదురైంది. అనంతపురం ఎంపీగా పోటీచేసిన ఆయన కుమారుడు, తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన తమ్ముడి కుమారుడు ఓడిపోయారు. రాజకీయంగా దెబ్బతీయడంతో జగన్‌ ఆగడం లేదు. వారిని ఆర్థికంగా దెబ్బతీయాలని పథకం వేశారు. జేసీ రవాణా, గ్రానైట్‌ వ్యాపారాలపై ఎడతెరిపి లేని సోదాలు జరుగుతున్నాయి. కేసుల మీద కేసులు పెడుతున్నారు. మరెక్కడా లేని విధంగా బస్సులను స్వాధీనం చేసుకుంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఫోర్జరీ కేసుపెట్టారు. మున్ముందు మరిన్ని కేసులు పడతాయని హెచ్చరించారు. దీంతో ఆయన భయపడిపోయి సొంత పార్టీ నుంచి తప్పుకొన్నారు. అనధికారికంగా వైసీపీలోనే ఉన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ప్రభుత్వం నుంచి వందల కోట్ల బిల్లులు రావలసి ఉంది. వాటన్నిటినీ తొక్కిపెట్టడంతో విధిలేక ఆయన టీడీపీకి దూరమయ్యారు. అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, మాజీ మంత్రి  శిద్దా రాఘవరావులకు చెందిన గ్రానైట్‌ గనులపై అధికారులు పలుమార్లు దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. టీడీపీ నేతలపై రూ.2,000 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులిచ్చారు. వారు హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆ నోటీసులను రద్దుచేసింది. అయినా వైసీపీ పెద్దలు వెనక్కి తగ్గడంలేదు. నయానో భయానో ఆయన్ను తమ వైపు లాక్కోవాలని చూస్తున్నారు. అసెంబ్లీలో టీడీపీ బలం 23. ఇద్దరు పోగా ఇంకా 21 మంది ఉన్నారు. చంద్రబాబుకు విపక్ష నేత హోదా లేకుండా చేయాలంటే ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోతే చాలు. ప్రస్తుతం వైసీపీ పెద్దలు ఇవే ప్రయత్నాల్లో ఉన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకపోతే టీడీపీ విచ్ఛిన్నమైపోతుందన్నది జగన్‌ అభిప్రాయం.
తప్పుడు కేసులు..
రాజకీయ ప్రత్యర్థులపై పెద్ద సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టించి, ఒత్తిడికి గురి చేయడం... లొంగేలా చేసుకోవడం కూడా తీవ్రస్థాయిలో జరుగుతోంది. అధికార పార్టీ వారు ఫిర్యాదు ఇవ్వగానే కేసు నమోదవుతుంది. అది కూడా బెయిలు రాని సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నారు. అదే... ప్రత్యర్థి పక్షం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. లేదంటే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేస్తున్నారు. కేసుల నమోదులో పెద్ద నేతలను కూడా వదిలి పెట్టడం లేదు. తనపై ఫర్నిచర్‌ దొంగతనం కేసు నమోదు చేయడంతో మనస్తాపానికి గురైన మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం ఈ పరిణామాలకు పరాకాష్ఠ. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కేసుల నమోదుకు భయపడిపోయి టీడీపీ సానుభూతిపరులు గ్రామాలు వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక కొందరు నేతలు అధికార పార్టీలో చేరిపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సంబంధించి పాతికేళ్ల కిందటి భూ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన్ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి నాలుగు గంటలపాటు కూర్చోబెట్టారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో అది ఆయన భూమేనని తేలిపోయింది. కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులపైనా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కోకొల్లలు.
ఎవరినీ వదలకుండా...
రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నవారేకాక వారికి సన్నిహితులుగా ముద్రపడిన వారికి కూడా కష్టాలు తప్పడం లేదు. ఒక ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థ రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టు నిర్వహిస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. పరిస్థితి బాగోలేదని గుర్తించిన ఆ సంస్థ... మరో పెద్ద కంపెనీకి విక్రయించాలని ప్రయత్నించింది. ఆ డీల్‌ అమలు కావాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనని.. లేనిపక్షంలో దానికి ప్రభుత్వపరంగా సహకారం ఉండదని పెద్దలు తేల్చిచెప్పారు. కప్పం ధర రూ. వెయ్యి కోట్లన్న సమాచారం అందడంతో విక్రయదారు, కొనుగోలుదారు షాక్‌ తిన్నారు. అధికార పీఠానికి సన్నిహితంగా ఉన్న ఓ సీనియర్‌ నేత రాష్ట్రంలో క్రషర్లు, ఇసుక రవాణా వ్యాపారంపై పట్టు సాధించి మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకునే పనిలో పడ్డారు. తన మాట కాదంటే చిక్కులు తెచ్చుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు పంపిస్తున్నారు. గతంలో ఇటువంటి వ్యవహారాలు చిన్న స్థాయిలో స్థానికంగా అక్కడక్కడా ఉండేవి. ఇప్పుడవి సీఎం స్థాయి నుంచే అమలు కావడం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. అధికారానికి కేంద్ర బిందువుగా ఉన్నవారు ఏ మాత్రం వెరపు లేకుండా యంత్రాంగాన్ని, పోలీస్‌ శాఖను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు.