ఏపీలో ఆ పార్టీదే విజయం అంటున్న శ్రీరెడ్డి

July 21, 2019

శ్రీరెడ్డి.. పరిచయం అవసరం లేని పేరిది. తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలనానికి తెర లేపిన ఆమె.. ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆ తర్వాత తరచూ న్యూస్ చానెళ్లలో డిబెట్లకు రావడం.. సినీ పరిశ్రమలోని పెద్దల బాగోతాన్ని బయటపెడతానంటూ పలువురిపై ఆరోపణలు చేయడం.. వీటన్నింటికీ మించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం వంటి వాటి వల్ల శ్రీరెడ్డి బిగ్ సెన్సేషన్ అయిపోయారు. ఆ తర్వాత పొలిటికల్ తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అధ్యక్షుడు, ఇతర నేతలపై తన అభిప్రాయాన్ని వెల్లడించేవారు. ఈ మేరకు ఆమె తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం ప్రారంభించారు. అయితే, తాజాగా ఏపీలో ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తన అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారో కూడా వెల్లడించారు.

‘‘ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లుగా చాలా కష్టాలు పడుతుంది. రాష్ట్రం విడిపోయిన తరువాత అధికార పార్టీ పనితీరుతో కొంతమంది సంతృప్తిగా ఉంటే.. మరికొంత మంది అసంతృప్తిగా ఉన్నారు. నాకు ఉన్న అవగాహన ప్రకారం.. చంద్రబాబు గారు గతంలో హైదరాబాద్‌ను బాగా డెవలప్ చేశారు. ఐటీ రంగంతో పాటు యూత్‌లో చంద్రబాబు వస్తే బాగుంటుంది అని ఉంది. అయితే బీజేపీ చేసిన కుయుక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు పడింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ.. ఏపీకి ఏం చేయలేదు కాబట్టి ఆ ప్రభావం టీడీపీపై పడింది. అలా అని చంద్రబాబుని తీసి పారేయలేం. ఆయన చాలా బలంగా ఉన్నారు. అయితే బీజేపీ సపోర్ట్ చేయకపోయినా చంద్రబాబు ఉన్నంతలో కష్టపడి రాజధాని కోసం పనిచేశారు. అయితే ఈ సందర్భంలో కొత్త ప్రభుత్వం వస్తే.. రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందని చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

చంద్రబాబు పాలనలో చాలా మంది విసిగిపోయిన వారు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు జగన్‌కి కలిసి వస్తున్నాయి. ఆయన చేసిన పాదయాత్రతో చాలా మంది జనం జగన్‌కి దగ్గరయ్యారు. సినిమా ఇండస్ట్రీతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు వైసీపీలో చేరడం కూడా పార్టీకి కలిసి వస్తున్నాయి. ఇవన్నీ బేరీజు వేసుకుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 60 శాతం.. టీడీపీకి 40 శాతం అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా మంచిదే. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా’’ అని ఆమె వివరించింది. అయితే, శ్రీరెడ్డి కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే.