కయ్యానికి కాలు దువ్వుతోంది... ఇద్దరు అందగత్తెల గొడవ

February 16, 2020


మ‌సాలా త‌క్కువ‌గా ఉన్న బిగ్ బాస్ సీజ‌న్ 2 పెద్ద‌గా ఆక‌ట్టుకోన‌ప్ప‌టికీ.. కౌశిక్ఆర్మీ పుణ్య‌మా అని.. సాగిన ర‌చ్చ తెలిసిందే. బిగ్ బాస్ ను సైతం కంట్రోల్ చేసి.. ఫ‌లితం త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంలో కౌశిక్ స‌క్సెస్ అయ్యార‌న్న మాట బ‌లంగా నాటుకుపోయిన సంగ‌తి తెలిసిందే.
గ‌త అనుభ‌వంతో ఈసారి మాత్రం ఎవ‌రికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని అనుకున్నారో ఏమో కానీ.. మొద‌టి రోజు నుంచే ఇంటి స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టే ప్లాన్ ను ద్విగ్విజ‌యంగా అమ‌లు చేశార‌ని చెప్పాలి. మొద‌టిరోజే.. నామినేట్ చేయ‌టం ద్వారా హీట్ పెంచేసిన బిగ్ బాస్.. మ‌నుషుల్లోని కోతిని బ‌య‌ట‌కు తెచ్చి చూపించే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి.
ఆట ఆడేందుకు వ‌చ్చిన‌ప్పుడు.. ఫోక‌స్ అంతా ఆట మీదే ఉండాలే త‌ప్పించి.. అప్పుడెప్పుడో త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న వేళ‌ల్లో స‌ద‌రు వ్య‌క్తులు చేసిన ప‌నుల్ని ప్ర‌స్తావించ‌టం.. దాని విష‌యంలో నోరు పారేసుకోవ‌టం చేయ‌కూడ‌దు. కానీ.. ఆ లైన్ ను క్రాస్ చేసిన శ్రీ‌ముఖి తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. షోలో తాను మిగిలిన వారి కంటే ప్ర‌త్యేకంగా నిల‌వాల‌ని త‌పిస్తుందో.. లేదంటే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాల‌నుకుంటుందో కానీ.. తొలి రెండు రోజుల్లోనే క‌య్యానికి కాలు దువ్విన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన శ్రీ‌ముఖి తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
నామినేట్ చేసిన స‌భ్యులు.. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎవ‌రో ఒక‌రిని రిప్లేస్ చేయ‌టం.. దానికి అనుగుణంగా ప‌స ఉన్న వాద‌న‌ను వినిపించి.. జ‌డ్జిగా ఉన్న హేమ చేత అవున‌నిపిస్తే చాలు నామినేట్ గండం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌న్న అవ‌కాశాన్ని వాడుకునే విష‌యంలో శ్రీ‌ముఖి అనుస‌రించిన తీరు ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.
శ్రీ‌ముఖి వంతు వ‌చ్చిన వేళ‌.. త‌న‌కు బ‌దులు హిమ‌జ‌ను రీప్లేస్ చేయాల‌నుకున్న‌ట్లు చెప్ప‌టం.. ఎందుక‌న్న దానికి హిమ‌జ లైఫ్ లో అన్ని విష‌యాల్ని లైట్ గా తీసుకుంటుంద‌న్న మాట‌ను చెప్పింది.
హిమ‌జ‌ గురించి త‌న‌కు తెలుసంటూ వాద‌న వినిపించింది. ఆమెతో క‌లిసి తాను సినిమా కూడా చేశాన‌ని.. ఆమె గురించి బాగా తెలుస‌న్న శ్రీ‌ముఖి మాట‌ల‌కు హిమ‌జ క‌న్నీళ్లు పెట్టుకుంది. కెరీర్ ప‌రంగా త‌న గురించి తెలుసు కానీ వ్య‌క్తిగతంగా ఏం తెలుస‌ని ఇలా రెడ్ మార్క్ వేస్తార‌ని వాపోయింది.
బిగ్ బాస్ షోలో పాల్గొనే వారు గ‌తంలో త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్నా.. వారికి సంబంధించి త‌మ మ‌న‌సులో ముద్రించుకు పోయిన భావాల్ని ప్ర‌స్తావించ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మొత్తానికి త‌న మాట‌ల‌తో శ్రీ‌ముఖి సేవ్ అయినా.. హిమ‌జ‌ను మాట‌ల‌తో అలా మాట్లాడేసే విష‌యంలో అవ‌స‌రానికి మించిన దూకుడుత‌నాన్ని ప్ర‌ద‌ర్శించింద‌న్న భావ‌న క‌లిగించేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.