సినిమా డిజాస్ట‌ర్.. కానీ..

July 03, 2020

గీతాంజ‌లి, ఆనందో బ్ర‌హ్మ‌, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా లాంటి సినిమాల్లో హీరో కాని హీరో పాత్ర‌ల్లో రాణించాడు క‌మెడియ‌న్ శ్రీనివాస‌రెడ్డి. మిగ‌తా క‌మెడియ‌న్ల‌లా నేల‌విడిచి సాము చేయ‌కుండా త‌న ఇమేజ్‌కు స‌రిపోయే హీరో పాత్ర‌ల‌తో అత‌ను ఆక‌ట్టుకున్నాడు. ఆ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి కూడా. కానీ ఈ ఊపును కొన‌సాగించ‌డంలో శ్రీనివాస‌రెడ్డి ఫెయిల‌య్యాడు. త‌ర్వాత అత‌డి జ‌డ్జిమెంట్ దెబ్బ తినేసింది. శ్రీనివాస‌రెడ్డి హీరోగా చేసిన త‌ర్వాతి సినిమాలు జంబ‌ల‌కిడి పంబ‌, భాగ్య‌న‌గ‌ర వీధుల్లో తుస్సుమ‌నిపించాయి. ఇందులో భాగ్య‌న‌గ‌ర వీధుల్లో ఫ‌లితం మ‌రీ దారుణం. ఈ చిత్రానికి శ్రీనివాస‌రెడ్డి ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా. ఒకేసారి ఆ రెండు అవ‌తారాలు ఎత్తాడు.
ఈ చిత్రం ఎంత దారుణ‌మైన ఫ‌లితాన్నందుకుందంటే.. షేర్ రూపంలో అస‌లేమీ రాలేదు. వ‌చ్చిన వ‌సూళ్లు థియేట‌ర్ల మెయింటైనెన్స్‌కు మాత్ర‌మే స‌రిపోయింది. మ‌రీ ఇంత దారుణ‌మైన ఫ‌లితాన్ని శ్రీనివాస‌రెడ్డి ఊహించి ఉండ‌డు. కాక‌పోతే ఈ సినిమా వ‌ల్ల అత‌ను పెద్ద‌గా న‌ష్ట‌పోయింది లేదు. శ్రీనివాస‌రెడ్డితో పాటు ఈత‌రం టాలీవుడ్ క‌మెడియ‌న్లంద‌రూ క‌లిసి ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ అని ఒక గ్రూప్ పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అందులోని స‌భ్యులే ఈ సినిమాలోనూ న‌టించారు. ఎవ్వ‌రూ పారితోష‌కాలు తీసుకోలేదు. లాభాలు వ‌స్తే పంచుకుందాం అనుకున్నారు. మేకింగ్‌కు మాత్ర‌మే ఖ‌ర్చ‌యింది. అది కూడా త‌క్కువే. ఈ మొత్తం శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల ద్వారా వ‌చ్చే మొత్తానికి చెల్లు అనొచ్చు. కాబ‌ట్టి శ్రీనివాస‌రెడ్డికి ఈ చిత్రం ద్వారా నో లాస్ నో గైన్ అన్న‌ట్లే. కాక‌పోతే ఇంకోసారి ఇలాంటి సాహ‌సాలు చేయ‌కుండా అత‌డికి పెద్ద పాఠం అయితే నేర్పింద‌నే చెప్పాలీ సినిమా.