పాస్‌లు ఇచ్చాక ఇదేం ప్రకటన జగన్ సార్?

June 01, 2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డి తీరు మరోసారి విమర్శల పాలవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారి విషయంలో ఆయన స్పష్టమైన వైఖరితో లేకపోవడం, ముందస్తు మార్గదర్శకాలేమీ జారీ చేయకుండా ఆలస్యంగా స్పందిస్తుండటంతో రాష్ట్ర సరిహద్దుల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. నెల కిందట తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవాళ్లందరినీ విజయవాడ, కర్నూలు సరిహద్దుల్లో ఆపేయడం ఎంత వివాదానికి దారి తీసిందో తెలిసిందే. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకునేవారికి పాసులు ఇస్తున్న సంగతి తెలిసినా సరే.. అప్పుడు ఏపీ సర్కారు ఏమీ స్పందించలేదు. తీరా అనుమతి పత్రాలు తీసుకుని ఏపీకి బయల్దేరి వస్తే.. మధ్యలో ఆపేశారు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియనట్లుగా జగన్ సర్కారు సైలెంటుగా ఉండటం.. తీరా సరిహద్దుల వరకు వచ్చాక ఆపేయడం విమర్శలకు దారి తీసింది.

రెండు ప్రభుత్వాల మధ్య కనీస స్థాయిలో కూడా సమన్వయం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. తెలంగాణలో పాస్‌లు ఇస్తున్న సంగతి తెలిసి ముందే ప్రకటన చేస్తే అప్పుడు ఆ పరిస్థితి తలెత్తేది కాదు. ఇక వర్తమానంలోకి వస్తే.. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, ఇతరులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రభుత్వాలే ప్రయాణ ఏర్పాట్లు చేసి వలస కూలీల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా.. అనుమతి పత్రాలు తీసుకుని సొంత వాహనాల్లో కూడా తమ స్వస్థలాలకు వెళ్లొచ్చని కూడా కేంద్రం పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు ఏపీకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణలో రెండు రోజుల నుంచి ఇలా పాస్‌లు జారీ చేస్తున్నారు. వీటిని తీసుకుని స్వస్థలాలకు చాలామంది బయల్దేరారు. ఐతే పాస్‌లు ఇస్తుండటంపై మీడియాలో వార్తలొస్తున్నా.. సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తున్నా కూడా ఏపీ సర్కారు పట్టించుకోలేదు. తీరా చూస్తే ఈ రోజు మళ్లీ వారిని ఆపేశారు. బయటి రాష్ట్రాల నుంచి ఎవ్వరూ ఏపీకి రావద్దంటూ జగన్ తీరిగ్గా ప్రకటన చేశారు. దీంతో మరోసారి ఆయన తీరు విమర్శల పాలవుతోంది.