బిగ్గెస్ట్ బ్లాస్ట్ : బ్యాంకు షేర్లకు చీకటి రోజు

August 11, 2020

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనాకు ఆర్థికమాంద్య భయాలు తోడయ్యాయి. అగ్నికి వాయువు తోడైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. భారత స్టాక్ మార్కెట్ పరిస్థితి కూడా అలానే మారింది. దీంతో.. ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశీయ మార్కెట్ లో బ్యాంకింగ్ షేర్ల పతనం భారీగా ఉంది. కలలో కూడా ఊహించలేనంత భారీగా షేర్ల ధరలు పడ్డాయి. ఈ మండే.. బ్లాక్ మండేగా రిజిస్టర్ అయినట్లే. సెన్సెక్స్ 11.7 శాతం పడిపోతే.. నిఫ్టీ ఏకంగా 11.5 శాతం నష్టపోయింది. ఒకదశలో ట్రేడింగ్ ను కాసేపు నిలిపివేశారు కూడా.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంకు.. యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఏడాది గరిష్ఠ స్థాయి నుంచి వారాల వ్యవధిలో ఈ షేరు విలువ ఏకంగా 45 శాతం పతనం కావటం చూస్తే.. అమ్మకాల ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఐసీఐసీఐ బ్యాంకు షేరు విలువ దారుణంగా పడిపోయింది. ఐసీఐసీఐ ధర రూ.293కు పడిపోతే.. యాక్సిస్ రూ.342కు తగ్గిపోయింది. యాక్సిస్ బ్యాంకుషేరు ఏకంగా 20 శాతం క్షీణించటం గమనార్హం.
ఈ రెండు ప్రైవేటు బ్యాంకులే కాదు.. ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంక్ ఆఫ్ బరోడా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఆర్ బీఎల్.. కోటక్ మహీంద్రా.. ఫెడరల్ బ్యాంకులన్ని నష్టాల పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్ బీఐ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. పరిస్థితుల్లో మాత్రం మార్పు రాని పరిస్థితి నెలకొంది.