‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆయన పాట

December 03, 2019

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సుద్దాల అశోక్ తేజ ఒకరు. ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, వేటూరి, సిరివెన్నెల తరహాలో ఫుల్ లెంగ్త్ లిరిసిస్టుగా కొనసాగలేదు, రెగ్యులర్‌గా పాటలు రాయలేదు కానీ.. ఆయన కలం నుంచి ఎప్పుడో ఒక పాట వచ్చినా కూడా అది అద్భుతంగా ఉంటుంది. సుద్దాల ఈ మధ్య పాటలు బాగా తగ్గించేశారు. ఎప్పుడో కానీ రాయట్లేదు. కొంత విరామం తర్వాత ఆయన ఓ ప్రెస్టీజియస్ మూవీ కోసం తన కలం కదిలిస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం కోసం సుద్దాల అశోక్ తేజ ఓ అద్భుతమైన పాట రాస్తున్నట్లు సంగీత దర్శకుడు కీరవాణి వెల్లడించాడు.
ఈ సినిమా చిత్రీకరణ మొదలై కొన్ని నెలలే అయింది. ఐతే షూటింగ్‌తో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. చిత్రీకరణ జరుగుతున్న అల్యూమినియం ఫ్యాక్టరీలోనే సంగీత చర్చలు సాగిస్తున్నాడు కీరవాణి. మరి సుద్దాల అక్కడే ఉండి పాట రాస్తున్నోరో ఏమో తెలియదు కానీ.. ఈ చిత్రం కోసం చాలా వేగంగా పాట రాస్తున్నారని, అదే సమయంలో పాట అద్భుతమని కీరవాణి తెలిపాడు. సుద్దాల పాట రాస్తున్నాడంటే అందుకు తగ్గ గొప్ప సందర్భం కూడా రాజమౌళి సృష్టించి ఉండాలి. సుద్దాల-కీరవాణి కలిశారంటే గొప్ప పాటే బయటికి వస్తుందని ఆశించవచ్చు. ఈ సంగతలా ఉంచితే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి విశేషాలు వెల్లడించడానికి రాజమౌళి అండ్ కో గురువారం ఉదయం 11.30కి మీడియాను కలవనున్న సంగతి తెలిసిందే.