చంద్రబాబు లో ఓ కొత్త మార్పు ...  వైరల్ అవుతోంది

May 31, 2020

అనుభవం మంచి లెస్స‌న్ లాంటిది..! అనేక పాఠాలు నేర్పిస్తుంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కూడా ఈ ఏడాది వ‌చ్చిన ఎన్నిక‌ల రిజ‌ల్ట్ అనేక పాఠాలు నేర్పింద‌నేది వాస్త‌వం. ముఖ్యంగా పార్టీని ఎలా లీడ్ చేయాలి ?  కార్య‌క‌ర్త‌ల్లో ఎలా జోష్ నింపాలి ? అనే రెండు కీలక అంశాల‌పై ఆయ‌న ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది. దీంతో ఆయ‌న‌ను ఆయ‌నే స‌రిదిద్దుకునేందుకు, కార్య‌క‌ర్తల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా జ‌రిగిన ఓ స‌మావేశంలో ఆయ‌న ఈ మార్పును స్ప‌ష్టంగా చూపించారు. దీంతో టీడీపీలో కొత్త జోష్ ప్రారంభ‌మైంది. మా నాయ‌కుడు ఇలా మారిపోతార‌ని అస్స‌లు ఊహించ‌లేదు. మేం కోరుకున్న‌ది ఇదే! అని వారు త‌మ అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకొని ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నార‌ట‌!
మ‌రి ఇంత‌కీ, చంద్ర‌బాబులో చోటు చేసుకున్న ఆ మార్పు ఏంటి?  కార్య‌క‌ర్త‌ల్లో పెరిగిన కొత్త ఉత్సాహం ఏంటో చూద్దాం. చంద్ర‌బాబు అన‌గానే.. వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది ఆయ‌న ప్రసంగాలే! ఏ స‌భ‌లో అయినా.. ఏ వేదిక ఎక్కినా, లేదా అధికారికంగా ఏదైనా అంశం పై స‌మీక్ష పెట్టినా కూడా బాబు మైకు పుచ్చుకున్నారంటే.. స‌భ‌లో ఉన్న వారు ఉలిక్కి ప‌డాల్సిన ప‌రిస్థితి ఇంత‌కు ముందుకు వ‌ర‌కు కనిపించేది. ఆయ‌న మైకు పట్టుకుంటే ఒక ప‌ట్టాన వ‌దిలి పెట్టేవారు కాదు.
ప్ర‌స్తుతంతో మొద‌లు పెట్టే ఆయ‌న ఆ వెంట‌నే గ‌తంలోకి వెళ్లిపోయి.. కొన్ని ద‌శాబ్దాల చ‌రిత్ర‌ను తొవ్వి తీయ‌డం, దీనిని సోదాహ‌ర‌ణంగా వివ‌రించ‌డం వంటివి కామ‌న్‌. దీంతో ఆయ‌న మైకు ప‌ట్టుకుంటేనా.. అంటూ.. కార్య‌క‌ర్త‌లు హ‌డ‌లి పోయేవారు. ఇక‌, అధికారులైతే.. స‌ద‌రు స‌మావేశాల‌కు వ‌చ్చే ముందుగానే బీపీ, షుగ‌ర్ టాబ్లెట్ల‌ను ముందుగానే వేసుకుని, లేదా వెంట తెచ్చుకుని హాజ‌ర‌య్యేవార‌నే ప్ర‌చారం ఉంది.
విష‌యం ఏదైనా, సంద‌ర్భం ఎలాంటిదైనా కూడా చంద్ర‌బాబుకు మైకు దొరికితే చాలు.. హీన‌ప‌క్షం రెండు గంట‌లు వ‌దిలేవారు కాద‌నే ప్ర‌చారం ఉంది.
దీంతో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌ద‌రు స‌భ‌ల్లో కునుకు తీసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. దీనివ‌ల్ల బాబు ప్ర‌సంగాల్లో ఉత్తేజం త‌గ్గి.. ఉత్తుత్తి మాట‌ల‌కు చోటు పెరిగింద‌నే వాద‌న కూడా వినిపించేది. పైగా ఆయ‌న స‌మావేశాలు ఎక్కువ‌గా రాత్రి వేళ్ల‌లో ఉండ‌డంతో నాయ‌కులు కూడా ఇబ్బంది ప‌డేవారు. ఆయ‌న చెప్ప‌ద‌లుచుకున్న‌ది ఏంటో అంతా అయిపోయాక కూడా అర్ధ‌మ‌య్యేది కాద‌ని కార్య‌క‌ర్త‌లు చెవులు కొరుక్కునే వారు. మ‌రి అలాంటి చంద్ర‌బాబులో అనూహ్య‌మైన మార్పు క‌నిపించింద‌ని అంటున్నారు కార్య‌క‌ర్త‌లు.
తాజాగా చంద్రబాబు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపై సోమ, మంగళవారాల్లో సమీక్షలు జరిపారు. నియోజకవర్గంలో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి? అనేది తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉంటారు? ఎవరు పోతారు అనే విషయంపై కూడా చంద్రబాబు ఫోకస్‌ పెట్టారట. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గాల‌పై మాట్లాడిన చంద్ర‌బాబు త‌న పాత ప్ర‌సంగాల‌కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టార‌ట‌!
మైకు అందుకుని కేవ‌లం తాను చెప్పాల‌నుకున్న‌ది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తున్నార‌ట‌. దీంతో స‌మీక్ష‌కు వ‌చ్చిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రిలాక్స్‌డా ఫీలై.. హ‌మ్మ‌య్య మా నాయ‌కుడు ఇలా ఉంటే చాల‌ని వారు తెగ సంబ‌ర ప‌డుతున్నార‌ట‌. ఏదేమైనా.. మార్పు మంచిదే.. అంటున్నారు నాయ‌కులు కూడా !! మ‌రి ఈ మార్పును బాబు ఎలా కంటిన్యూ చేస్తారో ? చూడాలి.