ఎన్నిక ప్ర‌చారానికి సెల‌వు ఇవ్వ‌లేద‌ని ఉద్యోగమే వదిలేశాడు

July 03, 2020

సినీ న‌టుల మీదా.. రాజ‌కీయ నాయ‌కుల మీదా అభిమానం మామూలే. కానీ.. తాను అమితంగా ఆరాధించే అధినేత కోసం ఉద్యోగాన్ని సైతం వ‌దిలేసే వీరాభిమాని ఉంటాడా? అంటే.. ఉన్నాడ‌నే చెప్పాలి. తాజాగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌టానికి సెల‌వు ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా బంగారం లాంటి ఉద్యోగాన్ని వ‌దిలేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
మంగ‌ళూరు తాలూకా సూర‌త్క‌ల్ కు చెందిన 41 ఏళ్ల సుధీంద్ర‌ హెబ‌ర్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ అధికారిగా ప‌ని చేస్తున్నాడు. ఈ నెల 5 నుంచి 12 వ‌ర‌కు సెల‌వు పెట్టి క‌ర్ణాట‌క‌కు వ‌చ్చాడు. ఎందుకో తెలుసా? బీజేపీ త‌ర‌ఫు ప్ర‌చారం చేయ‌టానికి. అయితే.. ఇక్క‌డ‌కు వ‌చ్చాక ఆయ‌న ప్ర‌చారం చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో ఈ నెల 18న పోలింగ్ జ‌ర‌గుతుంది.
దీంతో.. త‌న సెల‌వును పొడిగించాల‌ని కోరుతూ ఆయ‌న అధికారుల్ని కోరారు. వారు నో అని చెప్ప‌టంతో త‌న ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. దేశం బాగుప‌డాలంటే మోడీ మ‌రోసారి దేశానికి ప్ర‌ధాని కావాల‌ని.. అలాంట‌ప్పుడు దేశం కోసం ఉద్యోగం వ‌దిలేస్తే ఏమ‌వుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.
ఎన్నిక‌ల త‌ర్వాత సిడ్నీ వెళ‌తాన‌ని.. అక్క‌డ మ‌రో ఉద్యోగం చూసుకుంటాన‌ని చెప్పారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సిడ్నీ నుంచి క‌ర్ణాట‌క‌కు వ‌చ్చి పోలింగ్ లో పాల్గొన్నాడు. ఆయ‌న స‌తీమ‌ణి ఫిజీలో ఉంటారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఉద్యోగాన్ని మ‌రీ వ‌దిలేసిన సుధీంద్ర వ్య‌వ‌హారం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.