బిగ్‌బాస్-3లో ఆత్మహత్యాయత్నం

August 03, 2020

బిగ్‌బాస్ 1, 2 సీజన్లకు మించి రసవత్తరంగా సాగుతున్న బిగ్‌బాస్-3 సీజన్లో అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. పార్టిసిపెంట్లలో ఒకరు ఆత్మహత్యకు యత్నించారన్న వార్తలు ప్రచారమవుతున్నాయి. పార్టిసిపెంట్ల మధ్య సహజంగా జరిగే గొడవలే ముదరడంతో అందులో ఒకరైన నటి తీవ్రమైన ఆవేదనకు లోనై ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.

తెలుగు బిగ్ బాస్ మాదిరిగానే ప్రతిరోజూ రసవత్తరంగా, ఉత్కంఠగా సాగుతున్న తమిళ బిగ్‌బాస్-3లో ఈ అపశ్రుతి చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రముఖ సినీ హాస్యనటి మధుమిత ఆత్మహత్యాయత్నం చేసినట్లు తమిళనాట ప్రచారమవుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో యాభైరోజులకు పైగా గడిపిన మధుమిత.. గత శనివారం హౌస్‌ లీడర్‌గా వ్యవహరించింది. ఆ సమయంలో కావేరి వివాదంపై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఇతర పోటీదారులకు, ఆమెకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది.. తన ఎడమచేతి మణికట్టుపై కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమెను ఆమెను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి పంపించేశారని.. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.

మరోవైపు తెలుగు బిగ్‌బాస్‌లోనూ సోమవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందరినీ నవ్విస్తూ నిత్యం యాక్టివ్‌గా ఉంటే డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ కన్నీరు పెట్టుకోవడం బయట ఆయన ఫ్యాన్స్‌ను కదిలించివేసింది. భాస్కర్‌ను అలీ ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయడంతో ఆయన దాన్ని నమ్మక ద్రోహంగా భావించి ఉద్వేగానికి లోనయి ఏడ్చారు. సోమవారం షో అంతా నాటకీయ పరిణామాలతో కనిపించింది. ఇప్పటికే మూణ్నాలుగు వారాలు గడవడంతో ఆట పీక్ స్టేజికి చేరుతోంది. వచ్చే ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న చర్చ అంతటా సాగుతోంది.