సుజన చౌదరికి భారీ బ్యాడ్ న్యూస్ - నిజమేనా? గేమా?

June 06, 2020

బీజేపీ వలస నేత సుజన చౌదరికి భారీ ఝలక్ తగిలింది. తన పేరు మీద వందలాది కంపెనీలు నిర్వహించే సుజన చౌదరి బ్యాంకు రుణాలు పొందే తెలుగు పారిశ్రామిక ప్రముఖుల్లో టాప్ 10 లో ఉంటారు. వ్యాపార రుణాలు తీసుకోవడంలో ఆరితేరిన సుజన చౌదరి రుణాలు 6000 కోట్లకు పైనే తీసుకుని ఉంటాడని చెబుతారు. కార్పొరేట్ కంపెనీలు బ్యాంక్ రుణాలు తీసుకోవడం కొత్తేం కాకపోయినా... సుజనా చౌదరి మాత్రం అందులో సిద్ధహస్తులు అన్నది వినిపిస్తుంటుంది. అయితే, తాజా ఆ రుణాల్లో ఒకటి ఆయన తలకు చుట్టుకుంది. 

హైదరాబాదులో సుజనా ఆఫీసులకు కేంద్రమైన నాగార్జున హిల్స్ ప్రాంతంలో ఉన్న సుజన యూనివర్సల్ లిమిటెడ్ కంపెనీ... బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 400 కోట్లు బకాయి పడింది. కంపెనీ నుంచి బకాయి చెల్లింపుల విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు తనఖా పెట్టిన ఆస్తులు వేలం వేసి డబ్బులు వసూలు చేసుకోవడానికి బ్యాంకు రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఈరోజు సుజనా బకాయిల గురించి వేలం గురించి పత్రికా ప్రకటన ఇవ్వడంతో సుజన రుణ బండారం బట్టబయలైంది. ఆయనతో పాటు ఆయన కంపెనీకి గ్యారంటీ ఇచ్చిన వారందరికీ బహిరంగ నోటీసు ఇచ్చారు. అంటే వేలం పాట నిర్వహించేది మార్చి 23. వేలం పాటకు మార్చి 21న రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ లెక్కన 21లోపు బకాయిల్లో సగం చెల్లించినా కూడా వేలం ఆగిపోతుంది. అయితే... అలాంటి పరిస్థితే ఉంటే ఇక్కడిదాకా కూడా వచ్చేది కాదు వ్యవహారాం అంటున్నారు. 

ఈ సందర్భంగా మరో విషయం గుర్తుంచుకోవాలి. సుజన పార్టీ మారినపుడు సోషల్ మీడియాలో ఇది పార్టీ మార్పు కాదు, కేసు మాఫీ పథకం అంటూ సెటైర్లు వేశారు. వాటికి స్పందించిన బీజేపీ నేతలు... పార్టీ మారడానికి కేసులు అప్పులకు సంబంధం లేదు. బీజేపీలో ఉన్నంత మాత్రాన అన్నింటి నుంచి స్వేచ్ఛ లభిస్తుందనుకోవద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇపుడదే అయ్యింది. సుజనాకు చెందిన వందకు పైగా కంపెనీల్లో ఒక్క కంపెనీయే 400 కోట్లు రుణాలు పొందింది అంటే... మిగతా కంపెనీలన్నీ కలిపి ఎన్ని వేల కోట్లను బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాయో మరి. వాటి పరిస్థితి ఏంటో.... క్రమానుగతంగా తెలుస్తుంది. 

ఇకపోతే కార్పొరేట్ సర్కిల్స్ మాత్రం ఈ వేలాలు మామూలే అంటున్నారు. ఆ వేలంలో తిరిగి మళ్లీ సుజనా మనుషులే ఆ ఆస్తులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా తక్కువ సొమ్ముతోనే రుణమాఫీ చేసుకునే కొత్త మార్గం ఇది. అందుకే వేలం ప్రకటన వేస్తారని తెలుసు. వేలం వేస్తారని తెలుసు. తెలిసి కూడా సుజనా సైలెన్సుకు కారణం వ్యాపార రహస్యమే అంటున్నారు. వామ్మో ఈ కార్పొరేట్ తెలివితేటలు మామూలువి కాదు స్వామీ.