'సుజన సంచలనం- రాజధాని అంగుళం కదలదు, కేంద్రంతో మాట్లాడా

February 22, 2020

బీజేపీ ఎంపీ సుజన చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి అంగుళం కూడా కదలడానికి వీళ్లేదన్నారు. కేంద్రంతో మాట్లాడిన తర్వాతే ఈ మాటలు చెబుతున్నాను అని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉన్నా కూడా... కేంద్రం హక్కు ఏంటో త్వరలో సరైన సమయం చూసి వెల్లడిస్తుందని సుజన అన్నారు. ఏడు నెలల పాలనలో ఏ మాత్రం ప్రోగ్రెస్ లేకుండా జనాలు దృష్టి మరల్చే ప్రయత్నాలు చేసి వైసీపీ పబ్బం గడుపుతోందని సుజన చౌదరి వ్యాఖ్యానించారు. అసలు ఈ మూడు రాజధానుల పిచ్చి ఆలోచన ఎవరికీ అర్థం కాదన్నారు. అమరావతి రాజధానిగా ఖరారు అయ్యాక అక్కడ 130 కేంద్ర సంస్థలకు స్థల కేటాయింపులు జరిగాయని.. వీటిని మార్చాలంటే అనేక ఆమోదాలు కావాలి అన్నారు. 

అమరావతి కరెక్టు అయితే తెలుగుదేశం ఎందుకు ఓడిపోయిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమరావతి వేగంగా కట్టలేదని వారు ఓడించారన్న విషయాన్ని అందరూ గుర్తించాలని సుజన అన్నారు. టీడీపీ అమరావతిని ఆలస్యం చేసింది. నిజమే. కానీ వైసీపీ సర్కారును చూసి ఏపీ అంటేనే వ్యాపార వేత్తలు పారిపోయి పరిస్థితులు కల్పించారన్నారు. జగన్ ప్రభుత్వం మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లాభం కోసం చూస్తోందన్నారు. రాజధాని మార్చడం అంటే పాతకారు తీసి కొత్త కారు కొన్నంత ఈజీ కాదని, తనకు నచ్చిన చోట భవంతులు నిర్మించుకున్నట్టు కూడా కాదని సుజన అన్నారు. అసలు రాజధాని మార్పునకు ముఖ్యమంత్రి కారణం చెప్పగలరా? అని ప్రశ్నించారు సుజన.