​సుజనను కెలికి సాయిరెడ్డి తప్పు చేశారా?

July 10, 2020

విజయసాయిరెడ్డి ఏం చేస్తుంటారయ్యా... అంటే అయితే, రాజ్యసభలో పెద్ద బాలశిక్షలోని ప్రశ్నల్నీ వేస్తుంటారు. లేదంటే... చంద్రబాబును ఎలా తిట్టాలో హోంవర్క్ చేసుకుని వచ్చి ట్విట్టరులో ట్వీట్లు వేస్తుంటారు. చంద్రబాబు ఎంతైనా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. అందుకని విజయసాయి ఎన్నిమాటలన్నీ ప్రతిదానికీ స్పందించలేరు కదా. కాబట్టి బాబును ఎన్నిసార్లు ఏమన్నా సాయిరెడ్డికి చెల్లిపోయింది. కానీ... ఇటీవల సుజన చౌదరిని సాయిరెడ్డి గట్టిగా కెలికారు. మరి...తనలాంటి వాడితో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు సుజన చౌదరి. 

విజయసాయిరెడ్డి సుజన కింద నిప్పులు మాత్రమే వేశాడు. కానీ సుజన మాత్రం జగన్ కింద ఏకంగా పెట్రోలు పోసి మంట పెడుతున్నాడు. దీంతో సుజనను ఇరికించబోయిన సాయిరెడ్డి సుజన చేతిలో జగన్ ను ఇరికించాడు. సుజనది, సాయిరెడ్డిది ఒకే జాతి ... అది ఎలాగో ప్రజలకు తెలుసు. అందుకే సుజన చెలరేగిపోతున్నాడు. నన్నే కెలుకుతారా సాయిరెడ్డి... నాది పోయేదేముంది... నా తడాఖా చూపిస్తాను చూడు అన్నట్లు రకరకాల ట్వీట్లో జనానికి రాని కొత్త ఐడియాలతో జగన్ పై విమర్శలు చేస్తున్నారు సుజన చౌదరి. అసలే బీజేపీలో ఉన్నారు. కాబట్టి వైసీపీ ఆయనను తిట్లయితే తిట్టగలదు గాని... అంతకుమించి చేసేదేం ఉండదు. అందుకే సుజన ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. తాజాగా జగన్ వంద రోజుల పాలనపై సుజన ఓ రేంజ్ విమర్శలు చేశారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే...

* అమరావతిని ఘోస్ట్ సిటీ (దెయ్యాల నగరం)గా మార్చేశారు. 

* అమరావతిలో అవినీతి అన్నారు... మరి దానిని ఎక్కడ దాచిపెట్టారు?

* పోలవరం ప్రాజెక్టును అర్థాంతరంగా నిలిపివేశారు... కట్టే ఉద్దేశం ఏమైనా ఉందా? 

* ఉన్న పోర్టులు రద్దు చేస్తుంటే కొత్త పోర్టులు ఎలా వస్తాయో... ఈ లాజిక్ జగన్ కే ఎరుక. 

* పరిశ్రమల్లో అన్ని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలట. ఈ దేశానికి ఒకటే రాజ్యాంగం ఉందని మరిచిపోయారా? ఉన్న పరిశ్రమలు పోతాయి, కొత్తవి రావు. 

* సీఎం అవడానికి ముందు చెప్పిందేంటి? తర్వాత జగన్ చేస్తున్నదేమిటి?  

* అంతర్జాతీయ వేదికలపై భారత పతాకను ఎగురవేసిన తెలుగమ్మాయికి సత్కారం చేయని సీఎం... క్రీడలను ఏం ఉద్దరిస్తారో? 

* అక్రమ నిర్మాణాలు తొలగిస్తామన్నారు.. ప్రజావేదికతో ఆపేశారు. మరింకేమీ కూలగొట్టారా?  

* మడమతిప్పని పోరాటయోధుడు ప్రత్యేకహోదా కోసం అడగడా? 

* సన్నబియ్యం హుష్ కాకి. ​