వైరల్ ఫుటేజీపై సుజనా సెన్సేషనల్ కౌంటర్

August 10, 2020

ఒక పబ్లిక్ ప్లేసులో ప్రస్తుతం పదవీచ్యుతుడిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో కామినేని శ్రీనివాస్, సుజన చౌదరిని కలిశారు. ఆ హోటల్ నుంచి అందిన ఫుటేజీ తో మీడియా చెలరేగిపోయింది. రహస్య మీటింగ్ అని పేర్కొంటూ వైరల్ చేసింది.

అయితే, అంత పబ్లిక్ ప్లేసులో జరిగితే రహస్య మీటింగ్ ఎలాగవుతుందో అంతుపట్టని పరిస్థితి. అయితే, దీనిపై సుజన చౌదరి స్పందించారు. నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వంద సార్లు కలుస్తా... అందులో వైసీపీకేంటి అభ్యంతరం? అని నిలదీశారు సుజనా చౌదరి.

ఆయన సరిగ్గా ఏమన్నారంటే... ‘‘నిమ్మగడ్డను కలవడంలో ఎలాంటి తప్పు లేదు. మర్యాదపూర్వకంగా కలిశాను. అర్థం లేని వీడియో టేపులతో వైసీపీ నేతలు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు? అందులో ఏముంది? నాకైతే అర్థం కావడం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరస్థుడు కాదు, ఆయనను కలవకూడదని రూల్ ఏం లేదు. మాకు పరిచయం ఉంది, మంచి మిత్రులు మేమిద్దరు. ఎక్కడైనా కలుస్తాం. ఎపుడైనా కలుస్తాం. ఇందులో ఏం తప్పుంది? ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయడం వైసీపీ నాయకులు మానుకుంటే మంచిది’’ అని సుజన చౌదరి వ్యాఖ్యానించారు.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుబ్బిరామిరెడ్డి నడిపే హయత్ హోటల్లో వీరు కలవడంతో వైసీపీ నేతలు ఆ ఫుటేజీ సులువుగా తీసుకున్నారు. ఈ వీడియోను మీడియాకు విడుదల చేశారు. దీంతో అది వైరల్ అయ్యింది. ఇందులో అంత విషయం ఏముంది? అని సుజనా చౌదరి నిలదీశారు.