సూపర్ ట్విస్ట్- మోడీ షాలకు భలే షాకిచ్చిందబ్బా

July 08, 2020

దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల మీద విప‌రీతమైన ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా క‌ర్ణాట‌క‌లోని మాండ్య నియోజ‌క‌వ‌ర్గంగా చెప్పాలి. త‌న భ‌ర్త అంబ‌రీశ్ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ వార‌సురాలిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సుమ‌ల‌త ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడితో పోటాపోటీగా సాగిన ఎన్నిక‌ల్లో ఆమె విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.
ఆమె గెలుపులో బీజేపీ కీల‌క భూమిక పోషించిన‌ట్లుగా చెప్పాలి. మండ్య‌లో బీజేపీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని బ‌రిలోకి దించ‌కుండా క‌మ‌ల‌నాథులు.. ఆమెకు మ‌ద్ద‌తు ఇచ్చారు. అలా ఎన్నిక‌ల్లో గెలిచిన ఆమె బీజేపీలో చేర‌నున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సుమ‌ల‌త మీడియాతో మాట్లాడుతూ త‌న మీద సాగుత‌న్న ఊహాగానాల‌కు చెక్ చెప్పేశారు.
తాను బీజేపీలో చేర‌బోవ‌టం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. తాను స్వ‌తంత్ర ఎంపీగానే కొన‌సాగుతాన‌ని చెప్పిన ఆమె.. బీజేపీలో చేరే ఆలోచ‌న లేద‌ని చెప్పారు. సుమ‌ల‌త తాజా వ్యాఖ్య‌లు మోడీషాల‌కు షాకివ్వ‌టం ఖాయ‌మన్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఎన్నిక‌ల వేళ‌లో అన్ కండిష‌న‌ల్ గా మ‌ద్ద‌తు ఇచ్చిన నేప‌థ్యంలో ఆమె పార్టీలో చేరుతుంద‌ని భావించినా.. అందుకు భిన్న‌మైన నిర్ణ‌యాన్ని ఆమె వెల్ల‌డించారు.
ఇదిలా ఉంటే.. కర్ణాట‌క‌లో బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ ఓట‌మిపై ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జేడీఎస్ పొత్తు కార‌ణంగా కాంగ్రెస్ విజ‌య‌వ‌కాశాలు దెబ్బ తిన్నాయ‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా పోటీ చేసి ఉంటే 10 లోక్ స‌భ స్థానాల్లో విజ‌యకేత‌నం ఎగుర‌వేసి ఉండేవార‌న్నారు. తాను ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ కు తెలియ‌జేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ర్ణాటక‌రాష్ట్రంలో బీజేపీ విజ‌యం ప్ర‌జాబ‌లంతో గెల‌వ‌లేద‌ని తాను భావింటం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. మొత్తానికి ఎన్నిక‌ల్లో చేసిన సాయాన్ని వ‌దిలేసి.. పార్టీకి దూరంగా ఉండాల‌ని సుమ‌ల‌త తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.