టీడీపీని ఓడించిన వ్యక్తి ఎవరో చెప్పేశాడు

July 09, 2020

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... 37 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీపై ఘన విజయం సాధించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని గద్దె దించేసిన జగన్... తాను నవ్యాంధ్రకు నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీకి దక్కిన ఘోర పరాభవం, వైసీపీకి దక్కిన అఖండ విజయంపై ఆసక్తికర విశ్లేషణలు, లెక్కలు వినిపిస్తున్నాయి. ఇలాంటి లెక్కలనే తనదైన శైలిలో వినిపించిన సినీ నటుడు సుమన్... టీడీపీ ఓటమికి, వైసీపీ బంపర్ విక్టరీకి జనసేనాని పవన్ కల్యాణే కారణమని తేల్చి పారేశారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ ఆసక్తికర లెక్కలను విప్పిన సుమన్... టీడీపీ పరాజయానికి, వైసీపీ విజయానికి పవనే కారణమని చెప్పడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆది నుంచి టీడీపీతోనే సాగుతున్న సుమన్... బీసీ కోటాలో తనకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోతారా? అని ఎదురు చూశారు.

అయితే ఎప్పటికప్పుడు సుమన్ సహా పలువురు సినీ నటుల సేవలను ప్రచారానికి వినియోగించుకున్న చంద్రబాబు... సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. సుమన్ విషయంలోనూ చంద్రబాబు ఇదే ఫార్ములాను అనుసరించారు. ఏదైతేనేం... టీడీపీలో సుమన్ కు పెద్దగా ప్రాదాన్యమే దక్కలేదని చెప్పాలి. ఇక ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో టీడీపీకి ఘోర ఓటమి దక్కడంతో ఇందుకు గల కారణాలను ఎవరికి వారు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే సుమన్ కూడా తనదైన లెక్క చెప్పారు. టీడీపీ ఓటమికి పవన్ కల్యాణే కారణమని చెప్పిన సుమన్... వైసీపీ బంపర్ విక్టరీకి కూడా పవనే కారణమని చెప్పారు.