`కరోనా`పై సుప్రీం సంచలన నిర్ణయం

August 11, 2020

ప్లేగు, కలరా తరహాలో ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ తమకు తోచిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే పలు రాష్ట్రాలు...థియేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు కొన్ని రోజుల పాటు మూసివేశాయి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు, మ్యాచ్ లు, టోర్నమెంట్ లు రద్దయ్యాయి. కరోనా పై అప్డేట్స్ ఇస్తున్న రిపోర్టర్లు కూడా వర్క్ ఫ్రం హోం చేయాలంటూ కొన్ని మీడియా సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇక, తాజాగా ఈ జాబితాలోకి న్యాయస్థానాలు వచ్చి చేరాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాను అడ్డుకునేందుకు త్వరలోనే వర్చువల్ కోర్టులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా కేసుల విచారణ చేపట్టబోతున్నామని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రబూడ్ తెలిపారు.

కోర్టుల పరిధిలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే సుప్రీం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభిస్తామ‌ని ఆయన తెలిపారు. ట్ర‌య‌ల్ కోర్టుల్లో ప‌రిస్థితులు స‌మ‌స్యాత్మ‌కంగా ఉన్నాయ‌ని, కేసుల విచారణ గురించి హైకోర్టుల‌తో చీఫ్ జ‌స్టిస్ ఎస్‌ఏ బాబ్డే సంప్రదిస్తున్నారని తెలిపారు. తదుపరి దశలో కేసుల‌ను డిజిట‌ల్ ఫైలింగ్ చేయ‌బోతున్నామని చంద్ర‌చూడ్ చెప్పారు. ఇప్పటికే కోర్టుల్లో స్క్రీనింగ్ ప్రారంభించామ‌ని తెలిపారు. కరోనా నేపథ్యంలో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామని సుప్రీం గత శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. కోర్టు రూముల్లో వాది, ప్రతివాది, లాయర్లకు మాత్రమే అనుమతి ఇస్తామని, ప్రజలు సహకరించాలని కోరింది.  కాగా, భారత్ లో కరోనా దెబ్బకు ఇప్పటికే ఇద్దరు మరణించగా.. 107 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.