సుప్రీం దెబ్బకు రూ.10వేల కోట్లు గవర్నమెంటుకు లాభం

August 07, 2020

అత్యున్నత న్యాయస్థానమా మజాకానా? తాము తీర్పు ఇచ్చిన తర్వాత.. అమలు చేయకుండా ఉండిపోయిన టెలికం కంపెనీల్ని దులిపేసిన సుప్రీం ధర్మాసనం దెబ్బకు టెలికం దిగ్గజం తాజాగా రూ.10వేల కోట్లు పే చేసింది. ఈ భారీ మొత్తాన్ని కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే సమకూర్చటం విశేషం. తాము బకాయిగా ఉన్న మిగిలిన మొత్తాన్ని త్వరలోనే చెల్లిస్తామని భారతి ఎయిర్ టెల్ స్పష్టం చేసింది.
భారతీ హెక్సాకామ్.. టెలినార్ తరఫున ఈ రోజు (సోమవారం) రూ.10వేల కోట్లను టెలికం శాఖకు చెల్లించాం. ప్రస్తుతం మా బకాయి ఎంతన్న దాని మీద అంచనా వేస్తున్నాం. ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా ఎయిర్ టెల్.. వొడాఫోన్ ఐడియా.. ఇతర టెలికం సంస్థలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అన్ని టెలికం కంపెనీలు కలిపి రూ.1.47లక్షల కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. అయితే.. తాము జారీ చేసిన ఆదేశాల్ని అమలు చేయని వైనం సుప్రీం ముందుకు వచ్చింది. దీంతో తీవ్ర  ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అదే సమయంలో బకాయిలు చెల్లించని టెలికం కంపెనీల మీద ఎలాంటి చర్యలు తీసుకోరాదని టెలికం శాఖలో ఒక డెస్క్ ను ఏర్పాటు చేయటంపైనా విస్మయాన్ని వ్యక్తం చేసింది.
కోర్టు ఆగ్రహంతో టెలికం శాఖ తన తప్పును సరి చేసుకునే పనిలో పడింది. తమ అధికారి జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవటంతో పాటు.. తక్షణమే బకాయిలు చెల్లించాలని టెలికం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ టెల్ తొలి విడతగా రూ.10వేల కోట్ల మొత్తాన్ని టెలింకం శాఖకు చెల్లింపులు జరిపింది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఎయిర్ టెల్ ఇంకా రూ.35,500 కోట్లకు పైనే చెల్లింపులు జరపాల్సి ఉంటుందంటున్నారు. దగ్గర దగ్గర రూ.50వేల కోట్ల వరకూ వొడాపోన్ ఐడియా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే.. తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న వొడాపోన్ ఈ భారీ బకాయిని ఎలా క్లియర్ చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.