కెలికి తిట్టించుకున్న జగన్

June 01, 2020

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్నికల్ని ఆరు వారాల తర్వాత నిర్వహించేందుకు వీలుగా ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారితే.. ఆయన నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఆయన సామాజిక వర్గాన్ని బయటకు తీయటం పెను దుమారాన్ని రేపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు.. ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై గుర్రుగా ఉన్న ఏపీ సర్కారు.. ఎన్నికలు నిర్వహించాలన్న ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టుచీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి.. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఆదేశాలుజారీ చేయమని స్పష్టం చేసింది.
అదే సమయంలో.. ఎన్నికల్ని ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల కమిషనర్ ఇష్టమని చెప్పింది. అయితే.. ఎన్నికల కోడ్ ను రాష్ట్రంలో తక్షణమే ఎత్తి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ కోడ్ ఎత్తి వేయాలని.. ఉన్న పథకాలు తప్పించి కొత్త పథకాల్ని తెర మీదకుతీసుకురావొద్దని చెప్పింది.
ఎన్నికల నిర్వహణ తేదీ గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఈసీకి సూచన చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వాయిదా ఆదేశాల్ని కొట్టివేయాలన్న ఏపీ సర్కారు వాదనను సుప్రీం తోసిపుచ్చింది. తాజా పరిణామం.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందన్న మాట వినిపిస్తోంది.