మమతా బెనర్జీకి షాక్

May 27, 2020

త‌న రాజ్యంలో త‌న‌కు తోచిందే న్యాయం. అనుకున్న‌దే ధ‌ర్మంగా వ్య‌వ‌హ‌రించే అధినేత‌ల్లో పశ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఒక‌రుగా క‌నిపిస్తారు. కోర్టులు.. తీర్పులు లాంటి వాటిని ఆమె ప‌ట్టించుకోవాలంటే ప‌ట్టించుకోవ‌టం.. లేదంటే లైట్ తీసుకున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఆమెకు అల‌వాటు. తాజాగా త‌న ఫోటోను మార్ఫింగ్ చేసి.. ఎవ‌రూఊహించ‌నిరీతిలో ప్రియాంక హెయిర్ స్టైల్ ను పోలేలా చేసిన వైనంపై ఆమె ఆగ్ర‌హానికి గుర‌య్యారు.
దీదీకి కోపం వ‌స్తే మాట‌లా? మ‌మ‌త‌కు కోపం వ‌స్తే..ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయ‌నటానికి తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ లో చోటు చేసుకున్న ఉదంతంగా చెప్పాలి.
మమ‌త మీద వ్యంగ్య రీతిలో ఫోటోను ఫార్వ‌ర్డ్‌ చేసిన బీజేవైఎం కార్య‌క‌ర్త ప్రియాంక శ‌ర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఫోటోను ఫార్వ‌ర్డ్ చేసిన దానికే అరెస్ట్ ఎందుకంటే.. ఆమెను బెయిల్ మీద విడుద‌ల చేయాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మామూలుగా అయితే.. సుప్రీం ఆదేశాల‌తో వెనువెంట‌నే రిలీజ్ చేస్తుంటారు.
కానీ.. అది దీదీ రాజ్య‌మైన‌ప్పుడు అక్క‌డ రూల్స్ కాస్త భిన్నంగా ఉంటాయి క‌దా. అందుకే.. అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన ఆదేశాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియాంక శ‌ర్మ‌కు ఎదురైన అనుభ‌వాన్ని సుప్రీంకోర్టు దృష్టికి మ‌రోసారి తీసుకెళ్లారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. దీదీ ప్ర‌భుత్వ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.
ప్రియాంక శ‌ర్మ‌ను త‌క్ష‌ణ‌మే వ‌దిలిపెట్టాల‌ని.. లేదంటే కోర్టు ధిక్కార‌ణ చ‌ర్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఆమెను హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ప్రియాంక అరెస్ట్ ఏక‌ప‌క్ష‌మ‌న్న కోర్టు.. త‌క్ష‌ణ‌మే జైలు నుంచి విడుద‌ల చేయాల‌న్న త‌మ ఆదేశాల్ని ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణ‌మే జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని..లేదంటే చిక్కులు త‌ప్ప‌వ‌ని పేర్కొంది. దీనికి స్పందించిన బెంగాల్ ప్ర‌భుత్వ న్యాయ‌వాది మాట్లాడుతూ.. ఈ రోజు ఉద‌యం 9.40 గంట‌ల‌కు విడుద‌ల చేసిన‌ట్లు పేర్కొన్నారు. అయితే.. తాము సోమ‌వారం విడుద‌ల చేయాల‌ని చెబితే ఎందుకు రిలీజ్ చేయ‌లేద‌ని కోర్టు సూటిగా ప్ర‌శ్నించింది. తాజా వ్యాఖ్య‌తో దీదీ స‌ర్కారు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది.