అందరికీ నీతులు చెప్పి.. వీళ్లు పాటించరా?

February 22, 2020
CTYPE html>
ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటూ ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసి.. ఇండస్ట్రీలో తలెత్తే సమస్యలు, వివాదాల్ని పరిష్కరిస్తున్నారు టాలీవుడ్ సినీ పెద్దలు. సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాల మధ్య రిలీజ్ డేట్ విషయంలో పోటీ నెలకొని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే వీళ్లే పంచాయితీ చేసి సమస్యను పరిష్కరించారు. ‘వాల్మీకి’, ‘గ్యాంగ్ లీడర్’ నిర్మాతల మధ్య గొడవ అందులో ఒకటి. ఒకే రోజు రిలీజ్‌కు ఈ రెండు సినిమాలు సై అంటుంటే.. దిల్ రాజు అండ్ కో జోక్యం చేసుకుని వారం వ్యవధిలో అవి రిలీజయ్యేలా చూశారు. ఇలాంటి మరికొన్ని సమస్యల్ని వాళ్లే పరిష్కరించారు. ఆ సందర్భంగా ఇలాంటి పోటీ మంచిది కాదని, సర్దుకుపోవాలని సూచనలు కూడా చేశారు. కానీ అప్పుడలా చెప్పిన వాళ్లే ఇప్పుడు పంతానికి పోయి సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు కారణమవుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
సంక్రాంతి భారీ చిత్రాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్ర బృందాల మధ్య మూడు నెలలుగా రిలీజ్ డేట్ పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి వాళ్లు పంతం పట్టి జనవరి 12న రిలీజ్ అని కూర్చోగా.. మధ్యలో ప్రొడ్యూసర్స్ గిల్డే జోక్యం చేసుకుని 11న ‘సరిలేరు..’, 12న ‘అల..’ వచ్చేలా సర్దుబాటు చేశారు. కానీ ఇప్పుడు ‘అల..’ను ప్రి పోన్ చేయాలనుకోవడం, దీనికి ‘సరిలేరు..’ టీం ససేమిరా అంటుండటం.. రెండు సినిమాలూ మళ్లీ ఒకే రోజున పోటీకి సై అంటుండటం ఇండస్ట్రీ జనాలతో పాటు ప్రేక్షకులనూ విస్మయానికి గురి చేస్తోంది. ఇది ఎవ్వరికీ మంచిది కాదని తెలుస్తున్నా పంతానికి పోతున్నారు. ఎవరికి వాళ్లు పట్టుదలకు పోతున్నారు. ఈ రెండు చిత్రాల్లో గిల్డ్ పెద్దలు అరవింద్, రాజు కీలకంగా ఉండటం విశేషం. అందరికీ మంచి చెప్పి సర్దుబాటు చేసే వీళ్లు.. తమ సినిమాలకు వచ్చేసరికి సమస్యను పరిష్కరించుకోకుండా పంతానికి పోతుండటం విడ్డూరంగా ఉంది. సమస్య ఇంకా ముదరకముందే దీన్ని పరిష్కరించుకుని రాజీకి రాకుంటే భవిష్యత్తులో వీళ్ల మాట ఎవ్వరూ వినే పరిస్థితి ఉండదు.