బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ఒక సర్ ప్రైజ్

June 30, 2020

అక్కినేని కుటుంబం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి.. దారుణమైన ఫలితాలు ఎదుర్కొన్న యువ కథానాయకుడు సుశాంత్. సొంత బేనర్లో వరుసగా నాలుగు సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న అతను.. ఒక దశలో ఇండస్ట్రీలో కొనసాగడమే ప్రశ్నార్థకం అయింది. ఐతే గత ఏడాది ‘చి ల సౌ’ అనే చిన్న సినిమా చేసి తన ఉనికిని చాటుకున్నాడు. సుశాంత్ నటుడిగా కొంచెం గుర్తింపు సంపాదించింది ఈ చిత్రంతోనే. అతడిపై ఉన్న నెగెటివిటీ ఈ చిత్రంతో చాలా వరకు తగ్గింది. ఐతే ఓ మోస్తరు విజయాన్నందుకున్న ఈ చిత్రం తర్వాత ఇంకా తన తర్వాతి సినిమాను ఖరారు చేయలేదు సుశాంత్. ఐతే అతను ఈసారి హీరోగా కాకుండా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అది ఒక క్రేజీ ప్రాజెక్టు కావడం విశేషం.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో శనివారమే మొదలైన కొత్త సినిమాలో సుశాంత్ ఒక ప్రత్యేక పాత్ర చేయనున్నాడు. చిత్ర నిర్మాతలు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవీదీప్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో సుశాంత్‌ది స్పెషల్ అప్పీరియన్స్ అని పేర్కొన్నారు. కాలం కలిసి రానపుడు హీరో వేషాలకే పట్టుబట్టి కూర్చుంటే కష్టం. అలాగే కట్టుబడి ఉంటే కెరీర్లు ముందుకు సాగడం కష్టమే. ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర కెరీర్ ప్రమాదంలో పడ్డ సమయంలో ‘నేను లోకల్’.. ‘అరవింద సమేత’ చిత్రాల్లో నెగెటివ్ రోల్స్‌తో పేరు సంపాదించి కెరీర్‌ను దిద్దుకున్నాడు. సుశాంత్ కూడా ఇదే బాటలో సాగుతున్నట్లున్నాడు.