సుష్మా స్వరాజ్ *చివరి మాట* వైరల్

July 05, 2020

బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీకి చెందిన మహిళా నేతల్లో కీలక నేతగా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (66) కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుష్మా.... మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సుష్మా పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యాన్ని గుర్తించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. అయినా కూడా ఆమె కోలుకోలేకపోయారు. ఈ మేరకు తీవ్ర అస్వస్థతకు గురైన సుష్మా మరణించినట్టు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.

అనారోగ్య కారణాలతోనే 2019 ఎన్నికల్లో సుష్మా ప్రత్యక్ష పోటీ నుంచి తప్పుకున్నారు. తన పరిస్థితిని పార్టీ అధిష్టానానికి విన్నవించిన మీదటే సుష్మా... ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకున్నా ఎన్డీఏ2లో కేబినెట్ పదవి దక్కే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపించినా అనారోగ్య కారణాలతోనే ఆమె పదవిని వద్దనుకున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి సారి కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుష్మా... 2014లో బీజేపీ మరోమారు అధికారంలోకి వచ్చినప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా తనదైన శైలిలో రాణించారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మా... మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆ ఫీట్ ను అందుకున్న నేతగా రికార్డులకెక్కారు.

వృత్తి రీత్యా న్యాయవాది అయిన సుష్మా బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ఎంటయ్యారు. హర్యానా అసెంబ్లీకి మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మా... ఆ తర్వాత నేరుగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. తనదైన మాట తీరు, వైరి వర్గాల విమర్శలకు తూటాల్లాంటి సమాదానాలు ఇచ్చే తీరు సుష్మను నేషనల్ పాలిటిక్స్ లో ఓ ఎత్తుకు ఎదిగేలా చేశాయని చెప్పాలి. జాతీయ రాజకీయాల్లోకి రాగానే... ఎంపీగా సత్తా చాటిన సుష్మా... ఏకంగా ఏడు పర్యాయాలు లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1998లో ఢిల్లీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న సుష్మా... ఆ పదవికి రాజీనామా చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2009 నుంచి 2014 వరకు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగానూ సుష్మా తనదైన శైలిలో రాణించారు.

పార్టీ అధిష్ఠానం ఏ పని అప్పజెప్పినా కాదనకుండా చేసుకుపోవడంతో పాటుగా ఆ పనిని తనకంటే బాగా చేసే వారెవ్వరూ లేరని నిరూపించిన సుష్మా అటు పార్టీ నేతల్లోనే కాకుండా ప్రజల్లోనూ మంచి గుర్తింపు సంపాదించారు. న్యాయవాదిగా ఉండగానే సహ న్యాయవాది స్వరాజ్ కౌశల్ ను వివాహం చేసుకున్న సుష్మాకు ఓ కూతురు ఉంది. ఇదిలా ఉంటే... దేశ చరిత్రలోనే కీలక ఘట్టంగా పరిగణించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సుష్మా హర్షం వ్యక్తం చేశారు. ‘థ్యాంక్యూ ప్రైమ్ మినిస్టర్. థ్యాంక్యూ సో మచ్. ఐ వాజ్ వెయిటింగ్ టు సీ దిస్ డే ఇన్ మై లైఫ్ టైమ్’ అంటూ కశ్మీర్ బిల్లుపై వ్యాఖ్యానించారు. ఈ మాటలే సుష్మా చివరి మాటలుగా తెలుస్తున్నాయి. సుష్మా మృతి బీజేపీ శ్రేణులను షాక్ కు గురి చేసింది.