టీడీపీలో ఉత్కంఠ.. ఆయనపై పోటీ చేసేది ఎవరు..?

May 30, 2020

కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీని వీడారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, నర్సాపురం పార్లమెంట్ కో కన్వీనర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు. గతంలో పలు పార్టీలు మారిన ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీలో చేరిన మరుక్షణమే ఆయనను నర్సాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. దీంతో ఆయన అప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించేశారు. ఇక, నమ్మక ద్రోహం చేసిన రఘురామ కృష్ణంరాజు టీడీపీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందుకోసం ఆయన బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు అక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే దానిపై అంచనాకు మాత్రం రాలేకపోతున్నారు. దీంతో నరసాపురం టీడీపీ ఎంపీ సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రఘురామరాజుతో పోటీగా బరిలో టీడీపీ ఎవరిని నిలుపుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రఘురామకృష్ణంరాజుకు ధీటుగా సరియైున అభ్యర్థిని పోటీలో దింపాలని యోచిస్తున్న టీడీపీ అధిష్ఠానం.. ఇందులో భాగంగానే తొలుత కొత్తపల్లి సుబ్బారాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పేర్లను పరిశీలించింది. అయితే, వీరిలో కొత్తపల్లి ఆర్థికంగా బలంగా లేకపోవడంతో ఆయన పోటీ చేయలేనని చెప్పారట. అయితే, సీతారామలక్ష్మీ మాత్రం పోటీకి సన్నద్ధం అయినా.. అధిష్ఠానం మాత్రం పునరాలోచనలో పడిందని తెలిసింది. అందుకే మరింత బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తోంది. ఇలాంటి సమయంలో ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామానికి చెందిన డీసీసీబీ చైర్మన్‌ ముత్యాల వెంకటేశ్వర రావు(రత్నం) తనకు అవకాశం ఇప్పించాలని పత్రికల ద్వారా అధిష్టానాన్ని కోరారు.


అలాగే, కాళ్ళ మండలం పాతాళ్లమెరక గ్రామానికి చెందిన వ్యాపారవేత్త కనుమూరు గోపాలకృష్ణంరాజు(జీకేఎఫ్‌ గోపి) దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కాళ్ళ మండలం జువ్వలపాలెంనకు ఎంపీ గోకరాజు రంగరాజు సోదరుడు గోకరాజు రామరాజు పేరు ప్రముఖంగా వినబడుతున్నది. వీరితో పాటు కాళ్ళ మండలం కలవపూడి గ్రామానికి చెందిన కలవ పూడి సొసైటీ అధ్యక్షుడు మంతెన రామరాజు(కలవపూడి రాంబాబు) తనకు అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే శివ రాంబాబుకు టిక్కెట్‌ ఇవ్వాలని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అసలు నర్సాపురం బరిలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రఘురామ కృష్ణంరాజు మాత్రం మంచి దూకుడు మీద ఉన్నారు. మరి ఆయన దూకుడుకు కళ్లెం పడుతుందా..? లేదా..? చూడాలి.