స్వామి సొమ్ము.. స్వాములోరికి!?

August 03, 2020
శారదా పీఠాధిపతికి పెద్దల వితరణ
ఐదు ప్రధాన ఆలయాలకు అంతర్గత ఆదేశాలు!!

విశాఖ శారదా పీఠం.. ఇటు ఆంధ్రప్రదేశ్‌.. అటు తెలంగాణ ముఖ్యమంత్రులకు బహు ప్రీతిపాత్రమైనది. ఆ పీఠానికి అధిపతి స్వరూపానందేంద్రస్వామి. సీఎం జగన్‌కు రాజగురువులాంటివారు. ఆయన మాట సీఎం కాదనరు. జగన్‌ తాబేదారులైన అధికారులకైతే ఈయనే దేవుడు. అందుకే ఈ దేవుడు కోరాడని.. ప్రధాన ఆలయాల సొమ్మును మళ్లించడానికి సిద్ధమవుతున్నారు. ముఖం చూసి భవిష్యత చెప్పే ఈ స్వామి వారంటే మంత్రులు, ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పడిచచ్చి పోతుంటారు. తరచూ స్వరూపానందను దర్శించుకుని.. రాజశ్యామల యాగం జరిపించి తమకు ‘విజయాలు’ చేకూర్చి పెట్టాలని అభ్యర్థిస్తుంటారు. ఇందుకు ఎన్ని కోట్లయినా పీఠానికి సమర్పించుకుంటుంటారు. దండిగా ఆదాయం వస్తున్న సదరు పీఠం ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరింది. దేవదాయ శాఖ నుంచి నేరుగా ఖర్చుపెడితే ఏమవుతుందో..! పోనీ టీటీడీ పద్దు నుంచి పంపుదామంటే.. ఇప్పటికే ధర్మప్రచారం ఖాతా నుంచి స్వరూపానందకు తగిన మొత్తం ముడుతోంది. ఆయనకు అదనంగా ఇస్తే త్రిదండి రామానుజ చినజియ్యర్‌స్వామి నుంచి మిగతా పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా ఆశిస్తారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి.. ఏదో విధంగా చేస్తామనో.. కుదరదనీ చెబితే బాగుండేది. కానీ ‘మీ స్వామి సొమ్ములు పంపండి’ అంటూ ఐదు ప్రధాన ఆలయాలకు దేవదాయ శాఖ లేఖలు రాసింది. ఇంతకూ శారదా పీఠాధిపతికి డబ్బులెందుకు?  తాను ఈ నెల 3 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విశాఖ శారదా పీఠంలో హిందూ ధర్మపరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నానని.. నెలరోజులపాటు సాగే ఈ కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక సాయం చేయాలని డిసెంబరు 11న శారదాపీఠం దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు లేఖ రాసింది. మంత్రి ఈ లేఖను పరిశీలించి, పరిగణనలోకి తీసుకోవాలని దేవదాయ కమిషనర్‌కు సిఫారసు చేశారు. కమిషనర్‌ ముందు వెనుకలు ఆలోచించకుండా శ్రీశైలం, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి (కనకదుర్గమ్మ), ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవస్థానాల ఈవోలకు శ్రీముఖాలు పంపించారు. ‘పవిత్రమైన స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ జాతీయ మహాసభల నిర్వహణ కోసం ఆర్థిక సహాయం కోరారు. ఆ లేఖ ప్రతిని మీకు పంపిస్తున్నాం. హిందూ సనాతర ధర్మ ప్రచారం కోసం ఉద్దేశించిన కార్యక్రమానికి నిధులిచ్చేందుకు మీరు సిద్ధంగా ఉంటే.. తగిన ప్రతిపాదనలు పంపించండి’ అని అందులో పేర్కొన్నారు. పరోక్షంగా స్వామివారికి సాయం చేయాలని ఆదేశించారన్న మాట.
మాకెందుకీ తలనొప్పి?
కమిషనర్‌ లేఖ అందుకున్నాక ఆయా దేవస్థానాల కార్యనిర్వహణాధికారులు డోలాయమానంలో పడ్డారు. ఎందుకంటే... భక్తులు ఇచ్చే కానుకల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అవసరాలకు వాడుకోవాలి. ఎలాంటి ధార్మిక కార్యక్రమాలనైనా దేవస్థానమే నిర్వహించాలి. కానీ తమ ఆలయానికీ, దేవదాయ శాఖకు సంబంధం లేని ఒక పీఠం నిర్వహించే సొంత కార్యక్రమానికి దేవుడి డబ్బులివ్వొచ్చా అని సందేహించారు. పీఠాలు.. విరాళాలు, చందాల ద్వారానే తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఆ కార్యక్రమాల కోసం ఆలయాల సొమ్మును అడగడం ఇప్పుడే చూస్తున్నామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహా సభలు నిర్వహించడం మంచిదే. కానీ, అందుకు ఇతర దేవస్థానాల సొమ్మును పంపాలనడం శాసో్త్రక్తంగా, ధర్మబద్ధంగా లేదన్నది అందరి అభిప్రాయం. కానీ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన స్వామి కావడం.. కమిషనర్‌ తన శ్రీముఖంలో పరిగణనలోకి తీసుకోవాలని సూచించడంతో దేవస్థానాల అధికారులు దీనిపై తర్జన భర్జనలు పడుతున్నారు. సొమ్ము రావడం ఆలస్యం కావడంతో మహాసభల షెడ్యూల్‌ను మార్చేశారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఐదు రోజులే నిర్వహించాలని పీఠాధిపతి నిర్ణయించారు. ఈలోపు ప్రభుత్వం నుంచి సొమ్ము వస్తుందని భావిస్తున్నారు కాబోలు. అధికారులు మాత్రం ఈ కష్టం నుంచి తమను బయటపడేసే దేవుడి కోసం ఆకాశంలోకి చూస్తున్నారు.
ఈ స్వామికీ జగన్‌ గారి ఆంగ్లమంటే ప్రేమ!
మాతృభాషలో విద్యాబోధనను జగన్‌ నిషేధించి.. ఆంగ్ల మాధ్యమంలోనే స్కూళ్లలో చదువులు చెప్పాలని ఆదేశించడం స్వరూపానందకు తెగ నచ్చేసింది. తాను చెప్పే సంస్కృతం జనాలకు ఎటు తిరిగీ అర్థం కాదు.. అసలు జనమే తెలుగు చదువుకోకుండా ఉంటే మరీ మంచిది. తానేం తిట్టినా తెలియదని అనుకుంటున్నారేమో! అందుకే జగన్‌ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించి.. సహచర స్వాముల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా సన్యసించిన ఈ స్వామివారికి ఆడంబరాలంటే తగని మక్కువ. తిరుమలకు కంచి స్వామి గానీ, ఆదిశంకరులు స్థాపించిన పీఠాధిపతులు గానీ ఎవరు వచ్చినా.. ఎదురేగి స్వాగతాలు పలకరు. ఎందుకంటే అది కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు తిరుగాడిన దివ్యస్థలం. అందుకే వారు కూడా భక్తిశ్రద్ధలతో అక్కడకు చేరుకుంటుంటారు. స్వామిని దర్శించుకుంటారు. ఎంత పెద్ద  పీఠాధిపతి అయినా, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతిలాంటి ప్రముఖలకైనా తిరుమలలోనే అధికారులు స్వాగతం పలుకుతారు. కానీ స్వరూపానంద స్వామికి మాత్రం మేళతాళాలతో పూర్ణ కుంభ స్వాగతాలు కావాలి. ఇటీవల ఆయన తిరుమల వెళ్లినప్పుడు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలో ఆయనకు రాచమర్యాదలు జరిగాయి. చైర్మన్‌, అధికారులు ఆయన వద్ద తమ పరపతి పెంచుకోవడానికి ఆచారాలు, సంప్రదాయాలను పక్కన పెట్టేశారు. అలిపిరికి వెళ్లి మరీ శారదా పీఠాధిపతికి స్వాగతం పలికారు. ఈయనే గతంలో శ్రీవారి దర్శనార్థం వచ్చినపుడు కొన్ని సందర్భాల్లోనే ఎవరో ఒక అఽధికారి వెళ్లి మర్యాదపూర్వంగా కలిసేవారు. ఈ సారి మాత్రం ఊహించని రీతిలో స్వాగత సత్కారాలు లభించాయి. మఠాధిపతులు, పీఠాధిపతులను గౌరవించడం మన సంప్రదాయం. అయితే సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించడం అపచారం. పైగా ధనుర్మాసంలో మూలవిరాట్టు ఎడమచేతికి అలకరించే చిలుకబొమ్మను ఆలయం నుంచి అలిపిరి వద్దకు తీసుకొచ్చి స్వరూపానందకు ఇవ్వడం ఆలయ నిబంధనలకు విరుద్ధం. శ్రీవారికి ఆలంకరించిన పూలమాలను బయటకు ఇవ్వకూడదు. టీటీడీ అఽధికారుల అత్యుత్సాహంపై ధార్మిక సంస్థలు గుర్రుగా ఉన్నాయి.