మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన స్విగ్గీ బాయ్ !!

February 22, 2020

అత్యాచార ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. తమ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నప్పటికీ మృగాళ్లు మాత్రం బరితెగించడం మానడం లేదు. దిశా అత్యాచారంతో హైదరాబాదే కాకుండా యావద్దేశం ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. అయితే.. అదే హైదరాబాద్‌లో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికను ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ రేప్ చేయడం సంచలనంగా మారింది.
హైదరాబాద్‌లోని నింబోలీఅడ్డలో ఉన్న స్పెషల్ హోంలో ఉండే బాలికను అపహరించి లైంగిక వేధించాడన్న ఆరోపణలపై పి.శివ అనే 21 ఏళ్ల స్విగ్గీ డెలివరీ బాయ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హాస్టల్ మేట్రిన్ కొంతమంది అమ్మాయిలకు హోం తాళమిచ్చి తాను చెప్పిన వ్యక్తి వచ్చినప్పుడు తలుపు తీయాలని చెప్పారు. బాధిత బాలిక అలా తలుపు తీసి తరువాత వేయడం మర్చిపోయింది. తాళాలు మేట్రన్‌కు తిరిగిచ్చేశాక ఆ బాలికకు వాచ్‌మన్ ఫోన్ నుంచి శివ ఫోన్ చేశాడు. వాచ్‌మన్‌కు డబ్బులిచ్చి ఆ పనిచేయించిన శివ బాలికను తన స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేసి మియాపూర్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కనపించకపోవడంతో హోం నిర్వాకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది.
పోలీసులు వెంటనే కూపీ లాగి బాలికను దాచిన ప్రదేశానికి వెళ్లి ఆమెను రక్షించారు. అయితే, శివ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం శివను కూడా పోలీసులు పట్టుకున్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు శివ అంగీకరించాడు.