మోడీ చేతికి ఆ లిస్ట్ వచ్చేసింది... ఇపుడేం చేస్తారో?!

May 29, 2020

విదేశాల్లో అక్రమంగా దాచిన నల్లధనంపై కేంద్రం కన్నేయటం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశం గడప దాటిన నల్లధనాన్ని తిరిగి తెస్తామని.. ప్రతి ఒక్క భారతీయుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్న బడాయి మాటల్ని ప్రచారం చేయటం తెలిసిందే. ఫస్ట్ టర్మ్ ను విజయవంతంగా పూర్తి చేయటమే కాదు.. రెండో టర్మ్ ను అదే ఊపులో పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది కేంద్రంలోని మోడీ సర్కారు.
భారతీయులు.. ప్రవాస భారతీయులు విదేశాల్లో దాచిన నల్లధనానికి సంబంధించిన జాబితాను తాజాగా స్విస్ ప్రభుత్వం నుంచి తీసుకుంది. భారత పౌరుల బ్లాక్ మనీ ఖాతాలతో కూడిన వివరాల్ని స్విస్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి అందజేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకోవటానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్న డెబ్భైఐదు దేశాల్లో భారత్ ఒకటి. ఒప్పందంలో భాగంగా తాజాగా నల్లకుబేరుల జాబితా కేంద్రం చేతికి వచ్చింది.
మరి.. ఈ జాబితాతో ప్రభుత్వం ఏమి చేయనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒప్పందంలో భాగంగా.. తమకు అందిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ పర్చకూడదన్న క్లాజ్ ఉంది. మరి.. ఈ జాబితాతో ఏం చేయొచ్చన్న విషయంలోకి వెళితే.. తమ ఆదాయానికి సంబంధించిన రిటర్న్ లు దాఖలు చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు తమ ఆస్తుల వివరాల్ని సరిగా వెల్లడిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఒకవేళ.. తక్కువ మొత్తంలో ఆస్తులు చూపించి.. పన్ను ఎగవేతకు పాల్పడిన వారిపై చర్యలకు తాజాగా అందిన సమాచారం సాయంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. స్విస్ సర్కారు నుంచి అందిన నల్ల కుబేరుల వివరాల్లో ఎక్కువ శాతం వ్యాపారస్తులు.. విదేశాల్లో స్థిరపడిన భారతీయ పౌరులే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.
ఒప్పందంలో భాగంగా అందిన సమాచారంలో ఇప్పటికి అకౌంట్లు ఉన్న వారి వివరాలే కాదు.. 2018లో అకౌంట్లను మూసేసిన పెద్ద మనుషుల వివరాల్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో నల్లకుబేరులు ఎగ్గొట్టే పన్ను సొమ్ము మరింత పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇక.. నల్లకుబేరుల రెండో జాబితాను వచ్చే ఏడాది (2020) సెప్టెంబరులో భారత్ కు స్విస్ ప్రభుత్వం అందించనుంది.