సైరా ఫస్ట్ రివ్యూ వచ్చింది.. రేటింగ్ ఎంతో తెలుసా?

February 24, 2020

ఇప్పుడంతా సైరా మూమెంట్ నడుస్తోంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంతో తన ఆకలి తీరిందంటూ మెగాస్టర్ చిరంజీవి చెప్పేయటం తెలిసిందే. ఈ సినిమా ఫలితం తప్పనిసరిగా పాజిటివ్ గా ఉంటుందన్న మాట ఇండస్ట్రీ వర్గాల్లోనూ.. ల్యాబ్ రిపోర్ట్ పేరుతో వినిపిస్తోంది. అయితే.. ఇవన్నీ కూడా కొద్దిమంది మధ్య నడిచిన మాటలుగానే చెప్పాలి.
ఇందుకు భిన్నంగా తాజాగా ఒక ట్వీట్ మెగా అభిమానులకు పండుగ చేసుకునేలా చేస్తోంది. సైరాకు సంబంధించిన ఓవర్సీస్ సెన్సార్ రివ్యూ వచ్చేసింది. సైరా అదిరిపోయిందని.. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని.. కాసుల వర్షం కురవటం పక్కా అని చెప్పటమే కాదు.. ఏకంగా నాలుగు స్టార్లు ఇచ్చేస్తూ ఓవర్సీస్ సినీ బిజినెస్ మ్యాన్ కమ్ సెన్సార్ సభ్యుడైన ఉమర్ సంధు ట్వీట్ చేశారు.
ఈ నెల 2న రానున్న ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా చూస్తున్న సంగతి తెలిసిందే. చరిత్రలో మరుగున పడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తెరకెక్కించిన సైరా ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్.. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. తమిళ స్టార్ విజయ్ సేతుపతి లాంటి అగ్రనటులే కాదు.. నయతార.. తమన్నా లాంటిహీరోయిన్లు నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
దీనికి తగ్గట్లే ఫస్ట్ సెన్సార్ రివ్యూ అదిరిపోయిందంటూ ట్వీట్ చేశారు. దుబాయ్ నివాసి అయిన  ఉమర్ సంధు..తనను తాను మూవీ మార్కెటింగ్ ఎక్స్ పర్ట్ గా చెప్పుకుంటారు. తాజాగా ఆయన ట్వీట్ ప్రకారం సైరాను అద్భుతమంటూ పొగిడేశాడు. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ వరకూ చివరి వరకూ అద్భుతంగా ఉందని.. మెగాస్టార్ తో పాటు అమితాబ్.. సుదీప్ ల నటన అద్భుతంగా ఉందని పొగిడేశాడు.
ఒక ఇండియన్ ఫిలింమేకర్ గా సైరాను చూసినప్పుడు గర్వంగా ఉందన్నాడు. ఏ మాత్రం మిస్ చేసుకోలేని సినిమాగా అభివర్ణించటమే కాదు.. ఇప్పటికైతే ఈ మూవీ బాక్స్ ఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని.. రేపటికైతే (భవిష్యత్తులో) ఈ సినిమా ఒక క్లాసిక్ గా గుర్తుండిపోతుందని తెగ పొగిడేశాడు. సైరా ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే.. ఈ రివ్యూ ట్వీట్ తో మెగా అభిమానుల సంతోషం అంబరాన్ని అంటుతుందని మాత్రం చెప్పక తప్పదు. చివరగా ఒక్కమాట.. ఇదే సంధు.. సైరా రిలీజ్ అయ్యే అక్టోబరు 2న విడుదల కానున్న బాలీవుడ్ భారీ చిత్రం వార్ ను కూడా భారీగా మెచ్చేసుకున్నాడు. ఆ సినిమాకు అయితే ఏకంగా 4.5స్టార్లు ఇచ్చేశాడు.