సైరా నరసింహారెడ్డి’ రివ్యూ

July 12, 2020

నటీనటులు-చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు

సంగీతం- అమిత్ త్రివేది/జులియస్ పకియమ్

ఛాయాగ్రహణం-రత్నవేలు

మాటలు- సాయిమాధవ్ బుర్రా

నిర్మాత-రామ్ చరణ్

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి

 

మెగాస్టార్ చిరంజీవిది అసామాన్యమైన ఇమేజ్. తెరపై ఆయన పాత్ర చనిపోతే అభిమానులు జీర్ణించుకోలేరు. అందుకే ‘ఠాగూర్’ అనే సినిమా మాతృకలో హీరో చనిపోయినట్లు చూపించినా.. ఇక్కడ మాత్రం విషాదాంత ముగింపు లేకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో నటించడానికి సిద్ధపడ్డాడు. చరిత్ర ప్రకారం నరసింహారెడ్డి వయసు నాలుగు పదులు దాటకముందే అతడిని బ్రిటిష్ వాళ్లు ఉరివేసి చంపేశారు. మరి చిరంజీవిని అలా చూపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? అంగీకరించరు. అలాగని చరిత్రను విస్మరించలేరు. మరి చివర్లో హీరోను చంపేస్తే హీరోయిజం ఎలా పండుతుంది? చిరంజీవి ఇమేజ్‌కు ఎలా న్యాయం జరుగుతుంది? అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకు తనదైన శైలిలో ముగింపు ఇచ్చాడు. ఉరికంబం ఎక్కి తాడుకు వేలాడాక కూడా నరసింహారెడ్డి విదిలించుకుని వచ్చి నలుగురు బ్రిటిష్ సైనికుల్ని చంపి.. తన తల తెగిపడ్డాక కూడా ఒకరిని మట్టుబెట్టినట్లుగా చూపించాడు. ఇది ప్రేక్షకుల రోమాల్ని నిక్కబొడుచుకునేలా చేసే సన్నివేశమే.. కానీ ఇందులో వాస్తవం ఎంత? ఒక వాస్తవగాథలో ఇలాంటి సన్నివేశం పెట్టడం ఎంత వరకు సమంజసం? ఎగ్జాజరేషన్ మరీ ఈ స్థాయిలోనా?

‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ అంతేసి కొండల్ని అలవోకగా ఎక్కేస్తే.. వందల మీటర్ల ఎత్తు నుంచి జలపాతంలోకి దూకేస్తే.. టన్నుల బరువున్న విగ్రహాన్ని ఒక్కడే కింద పడిపోకుండా ఆపేస్తే మనకేమీ అతిశయోక్తిలా అనిపించలేదు. ఎందుకంటే అది ఒక కల్పిత గాథ. అక్కడ ఊహలకు హద్దు లేదు. రాజమౌళి కాన్వాస్‌కు పరిమితుల్లేవు. కానీ ‘సైరా నరసింహారెడ్డి’ ఒక వాస్తవ కథతో తెరకెక్కిన చిత్రం. కొంత మేర చరిత్రను మార్చుకుంటే.. ఆయన వీరత్వాన్ని పెంచి చూపిస్తే ఇబ్బంది లేదు. కానీ ప్రతి సన్నివేశంలోనూ అతిశయోక్తులే కనిపిస్తే మాత్రం జీర్ణించుకోవడం కష్టం. ముందు నుంచి చరిత్ర మరిచిన ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరమీదికి తెస్తున్నట్లుగా చెప్పి.. చివరికి తెరమీద మాత్రం ఏమాత్రం వాస్తవికంగా అనిపించని ఒక కథను చూపించడం ‘సైరా నరసింహారెడ్డి’లో అత్యంత అభ్యంతరకరంగా అనిపించే విషయం.

ఐతే ఒక్క విషయంలో మాత్రం దర్శకుడు సురేందర్ రెడ్డిని అభినందించాలి. ప్రేక్షకులు సీట్లలో కాస్త సర్దుకునే సమయానికే ‘సైరా’ పూర్తిగా వాస్తవ దూరంగా ఉండబోతోందని.. ‘బాహుబలి’ స్టయిల్లో వీరోచిత దృశ్యాల్ని ఆవిష్కరించడమే తన లక్ష్యమని సంకేతాలు ఇచ్చేశాడు. మత్తు మందు కలిపిన నీళ్లు తాగి జనాల మీదికి వీరావేశంతో దూసుకొస్తున్న వందలాడి ఎద్దుల్ని నరసింహారెడ్డి ఒక్కడే గుర్రం మీద వెళ్లి దారి మళ్లించడం.. లోయలోకి పడబోతున్న ఆ ఎద్దుల్ని కూడా కాపాడటంతోనే ‘సైరా’ సినిమా ఎలా సాగుతుందో ఒక అవగాహనకు వచ్చేస్తాం.  సినిమా విషయంలో ముందుగానే ఇలా ప్రిపేర్ చేసేయడంతో చాలా త్వరగా ఇది మనకు తెలిసిన నరసింహారెడ్డి అనే స్వాతంత్ర్య సమర యోధుడి కథ అనే విషయాన్ని మరిచిపోతాం. నిజానికి అలా మరిచిపోతే తప్ప ‘సైరా’ సినిమాను ఆస్వాదించడం కష్టం కూడా.

పరిచయ సన్నివేశం దగ్గర్నుంచి చివరి దాకా  హీరో ఎలివేషన్లతోనే ‘సైరా’ సినిమా సాగిపోతుంది. స్వతంత్ర పోరాటం.. దేశభక్తి. లాంటి అంశాలన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఒకప్పుడు మన జనాలపై బ్రిటిష్ వాళ్ల అరాచకాల్ని చూపించినా కూడా బాధ, భావోద్వేగం లాంటివేమీ కలగవు. బ్రిటిష్ అధికారిని నరసింహారెడ్డి నీటి మడుగులోకి వెళ్లి చంపుతుంటే ఒక కమర్షియల్ సినిమాలో విలన్ని హీరో మట్టుబెడుతున్నట్లే అనిపిస్తుంది తప్ప.. మరో రకమైన భావోద్వేగం ఏమీ కలగదు.ప్రథమార్ధంలో ఇంట్రో సీన్.. ఇంటర్వెల్ బ్యాంగ్ మినహాయిస్తే హై ఇచ్చే సన్నివేశాలు లేవు. కథనం నత్తనడకన నడుస్తుంది. మధ్యలో కొన్ని సెంటిమెంట్ సీన్లు పడ్డాయి. ద్వితీయార్ధంలో మాత్రం కథ ఎక్కడా ఆగదు. 

ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇవ్వడమే లక్ష్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కడికక్కడ హీరో ఎలివేషన్ ఉండే ఎపిసోడ్లు సిద్ధం చేసి పెట్టుకున్నాడు. తన కోట మీదికి బ్రిటిష్ సైన్యం దాడికి దిగినపుడు దాన్ని తిప్పి కొట్టే ఎపిసోడ్.. ప్రి క్లైమాక్స్ కంటే ముందు వచ్చే యుద్ధ సన్నివేశాల్లో భారీతనం కనిపిస్తుంది. ఇక్కడ ‘సైరా’ చిత్రం ‘బాహుబలి’ని తలపిస్తుంది. అయితే కేవలం కొన్ని వందల మంది సైన్యాన్ని వెంటేసుకుని.. వేలాది మంది బ్రిటిష్ సైన్యాన్ని నరసింహారెడ్డి ఎదుర్కోవడం, ఏకంగా పదివేల మందిని మట్టుబెట్టడం అతిశయోక్తికే అతిశయోక్తి అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఎమోషన్లతో కథ నడిచింది, డ్రామా పండింది ఒక్క ప్రి క్లైమాక్స్‌లో మాత్రమే. అక్కడ ప్రేక్షకుల్లో ఎమోషన్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. జగపతిబాబు పాత్రకు సంబంధించిన మలుపు, డ్రామా ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశంలో సాయిమాధవ్ బుర్రా కలం నుంచి జాలువారిన అద్భుతమైన డైలాగులు ఉద్వేగం కలిగిస్తాయి. కానీ చిరంజీవి వాయిస్ తేడా కొట్టడం వల్ల ఆ డైలాగులు అనుకున్న స్థాయిలో పండలేదు.

టెక్నికల్‌గా ‘సైరా’ ఉన్నతంగానే కనిపిస్తుంది. ఉన్న ఒకట్రెండు పాటలు బాగున్నాయి. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సైరా పాట ప్లేస్మెంట్, టేకింగ్ చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్‌ కూడా బాగానే కుదిరింది. రత్నవేలు ఛాయాగ్రహణం, ఫైట్ మాస్టర్ల పనితనం ఆకట్టుకుంటాయి. చిరు కలల ప్రాజెక్టు కావడంతో రామ్ చరణ్ అసలేమాత్రం రాజీ లేకుండా భారీగా ఖర్చు పెట్టేశాడు. అప్పటి కాలంలో వాతావరణం ఎలా ఉండేదో కూడా పట్టించుకోకుండా అవసరం లేని భారీతనంతో కొన్ని సన్నివేశాలు కృత్రిమంగా అనిపించే స్థాయిలో ఖర్చు చేశారు. ఇక కథ నడిచేది రాయలసీమ ప్రాంతంలో అయినా అక్కడి నేటివిటీ, భాష, యాస ఏవీ సినిమాలో కనిపించవు. ఈ విషయంలో పూర్తిగా లిబర్టీ తీసుకున్నారు. 

చివరగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరు ఏమాత్రం ఫిట్ అయ్యాడు అన్నది మాట్లాడుకుందాం. ఎప్పుడో 20 ఏళ్ల కిందట పరుచూరి సోదరులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద సినిమా చేయాలనుకున్నారట. ఈ కథను వాళ్లు చిరు దగ్గరికి తీసుకురావడానికి పదేళ్లు పట్టింది. ఈ సినిమా తెరకెక్కేసరికి ఇంకో పదేళ్లు గడిచాయి. కానీ ఈ కథను అనుకున్నపుడే చిరుతో పరుచూరి వారు సినిమా మొదలుపెట్టించేసి ఉంటే బాగుండేది. ఆ వయసుకి ఆయన ఈ పాత్రకు బాగా సూటయ్యేవారు. ఇ ఇప్పట్లా అవసరం లేని భారీతనం, అతిశయోక్తులు లేకుండా వాస్తవికంగా నరసింహారెడ్డి కథను తెరకెక్కించి ఉంటే సినిమా జెన్యూన్‌గా అనిపించేది. ఇంతకంటే మెరుగ్గా కూడా ఉండేదేమో. ఇప్పుడు ప్పుడు 64 ఏళ్ల వయసులో ఎంత కష్టపడ్డా కూడా ఈ పాత్రలో ఫిట్ కాలేకపోయాడు చిరు. కొన్ని చోట్ల మినహాయిస్తే చాలా చోట్ల చిరు లుక్ బాగా లేదు. యాక్షన్ ఘట్టాలు చాలా చోట్ల ఒరిజినల్‌గా అనిపించకపోవడం ఆంతర్యమేంటో ప్రేక్షకులు సులువుగానే పసిగట్టేయగలరు. చిరు వాయిస్‌ మాడ్యులేషన్ కూడా తేడాగా ఉండటంతో డైలాగులు అనుకున్న స్థాయిలో పేలలేదు. నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. ఇతర బలహీనతల వల్ల చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాడు. చిరు అభిమానులకు రుచించకున్నా ఈ మాట వాస్తవం. ఒకసారి ‘బాహుబలి’లో ప్రభాస్‌ను చూస్తే ఎలా యోధుడిలా కనిపించాడో గుర్తు చేసుకుని ‘సైరా’లో చిరు ఎలా ఉన్నాడో చూసుకుంటే వాస్తవం బోధపడుతుంది.

 

రేటింగ్-3/5